అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి మరణించి ఏళ్లు గడుస్తున్నా, ఆమెకు సంబంధించిన వార్తలు ఏదో ఒక రూపంలో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి వినిపిస్తున్న వార్త ఆమె అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీదేవికి అత్యంత ఇష్టమైన చెన్నైలోని ఒక ఖరీదైన ఆస్తి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం కాస్తా ఇప్పుడు మద్రాస్ హైకోర్టు మెట్లెక్కడం సంచలనంగా మారింది. తన తల్లి ఆస్తిని కాపాడుకునేందుకు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ తన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి న్యాయపోరాటానికి దిగారు.
దాదాపు 36 ఏళ్ల క్రితం, అంటే 1988లో శ్రీదేవి తన సొంత సంపాదనతో ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) సమీపంలోని చెంగల్పట్టు ప్రాంతంలో 4.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో అన్ని పత్రాలను పక్కాగా సరిచూసుకున్న తర్వాతే ఈ డీల్ కుదిరింది. అయితే, ఇప్పుడు హఠాత్తుగా రంగంలోకి దిగిన మొదలియార్ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు, ఆ భూమి తమ పూర్వీకులదని, తమకే దానిపై హక్కులు ఉన్నాయని సివిల్ దావా వేశారు. దీంతో ఏళ్ల తరబడి శాంతియుతంగా ఉన్న ఈ ఆస్తి చుట్టూ ఇప్పుడు వివాదపు మేఘాలు కమ్ముకున్నాయి.
ఈ వివాదం గత కొంతకాలంగా చెంగల్పట్టు జిల్లా కోర్టులో సాగుతోంది. అయితే అక్కడ విచారణ నానాటికీ ఆలస్యం అవుతుండటంతో, ఈ అక్రమ దావాను వెంటనే కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం తాజాగా మద్రాస్ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వద్ద ఉన్న పత్రాలన్నీ ఒరిజినల్ అని, కావాలనే కొందరు ఈ ఆస్తిని వివాదాల్లోకి నెడుతున్నారని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు ధర్మాసనం, మార్చి 26 వరకు తదుపరి చర్యలపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతానికి కోర్టు స్టే ఇవ్వడంతో కపూర్ కుటుంబానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టే. అయితే, ఈ కేసులో అసలైన మలుపు ఈ నెల 26న జరగబోయే పూర్తి స్థాయి విచారణలో ఉండబోతోంది. ఒకవైపు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్, మరోవైపు తన తల్లి జ్ఞాపకమైన ఈ ఆస్తి కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఖరీదైన భూమి వివాదానికి కోర్టు చెక్ పెడుతుందో లేదో చూడాలి.