నాకు న‌య‌న‌తార కావాలి.. పెళ్లి చేస్తారా.. ఎంపీ షాకింగ్ కామెంట్స్‌!

admin
Published by Admin — March 17, 2026 in Politics, National
News Image

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వాడీవేడీగానే ఉంటాయి. కానీ, తాజాగా AIADMK ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఒక పక్క మహిళల భద్రత కోసం నిరసనలు తెలుపుతూనే, మరోపక్క ఒక అగ్ర కథానాయిక గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను విమర్శించే క్రమంలో, లేడీ సూపర్ స్టార్ నయనతార పేరును అనవసరంగా వివాదంలోకి లాగడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనలో షణ్ముగం వాడిన భాష అత్యంత అభ్యంతరకరంగా ఉంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం యువతకు ఇచ్చిన కలలు కనండి అనే సందేశాన్ని ఆయన తన చౌకబారు రాజకీయ విమర్శలకు వాడుకున్నారు. ``కలాం గారు కలలు కనమన్నారు.. స్టాలిన్ ఆ కలలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు నాకు నయనతార కావాలని కల వస్తే.. స్టాలిన్ గారు ఆమెతో నాకు పెళ్లి కుదుర్చుతారా?`` అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి, ఒక మహిళను వస్తువుగా చిత్రీకరించడం ఆయన విజ్ఞతకే వదిలేయాలని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే.. మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, వారి రక్షణను కాపాడాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం లోనే షణ్ముగం ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత గురించి మాట్లాడుతూనే, ఒక మహిళా సెలబ్రిటీని కించపరిచారు. రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే ప్రభుత్వ విధానాలపై చేయాలి కానీ, ఇలా వ్యక్తిగత విషయాలను, సినీ నటీమణులను లాగడం రాజకీయాల్లో దిగజారుతున్న విలువలకి అద్దం పడుతోంది.

ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో షణ్ముగంపై విమర్శల వర్షం కురుస్తోంది. ``ఒక ఎంపీగా మీరు నేర్చుకున్న సంస్కారం ఇదేనా?`` అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. నయనతార అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. 

Tags
Nayanthara CV Shanmugam Tamil Nadu Politics AIADMK MK Stalin Lady Superstar
Recent Comments
Leave a Comment

Related News