వైసీపీకి గుడ్ బై.. గంటాతో అవంతి హాయ్ హాయ్!

admin
Published by Admin — March 17, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాట గంటా-అవంతి కలయికతో మరోసారి అక్షర సత్యమైంది. నిన్నటి వరకు భీమిలి గడ్డపై నిప్పులు కురిపించుకున్న ప్రత్యర్థులు.. నేడు ఒకే వేదికపై చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖలోని సన్ రే రిసార్ట్స్ సాక్షిగా ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అతిథిగా విచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలు అన్నీ పక్కన పెట్టి.. పాత స్నేహితుల్లా ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. రాజకీయ వైరం కేవలం ఓట్ల వరకేనని, వ్యక్తిగత బంధాలు వేరని వీరిద్దరూ నిరూపించారు. 

వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అవంతి శ్రీనివాస్ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో గంటాతో ఆయన జరిపిన ఈ భేటీ కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజారాజ్యం నుంచి మొదలైన వీరిద్దరి ప్రస్థానం.. కాంగ్రెస్, టీడీపీ మీదుగా సాగింది. మధ్యలో రాజకీయ కారణాలతో అవంతి వైసీపీ గూటికి చేరినప్పటికీ, ఇప్పుడు మళ్ళీ తన పాత మిత్రుడు గంటాతో చేతులు కలపడం ద్వారా కూటమి(టీడీపీ లేదా జనసేన)లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. 

ఈ వేడుకలో కేవలం గంటా-అవంతి మాత్రమే కాదు.. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి హేమాహేమీలు కూడా సందడి చేశారు. ప్రత్యర్థులంతా ఒకే గొడుగు కింద చేరి విందు వినోదాల్లో పాల్గొనడం చూస్తుంటే, విశాఖ రాజకీయాల్లో త్వరలోనే పెద్ద మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పాత ప‌గ‌లు వ‌ద్దు.. పాత దోస్తీనే ముద్దు అన్న‌ట్లుగా సాగిన ఈ వేడుక అవంతి రాజకీయ భవిష్యత్తుకు కొత్త దారి చూపుతుందేమో చూడాలి. అప్పుడు భీమిలి గడ్డపై మాటల యుద్ధం చేసిన ఈ ఇద్దరు నేతలు.. రేపు ఒకే పార్టీ కండువా కప్పుకుని మళ్ళీ కలిసి తిరిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

Tags
Avanthi Srinivas Ganta Srinivasa Rao AP Politics Andhra Pradesh TDP YSRCP Ap News
Recent Comments
Leave a Comment

Related News