ఆస్తి కోసం చెల్లితో లొల్లి ఏంది జగన్?

admin
Published by Admin — March 22, 2026 in Andhra
News Image

బంధానికి.. అనుబంధానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చే విలువ చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ డబ్బులకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. తన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు సాయం కోరి వస్తే ఇచ్చేసే వారే తప్పించి.. లెక్కలేసుకోవటం ఆయనకు చేతకాని వ్యవహారం. తాను అధికారంలో ఉన్నప్పుడు తన వద్దకు వచ్చి అడిగినోళ్లకు అడిగినంత సాయం చేయటమే తప్పించి.. అదేదో తానే చక్కదిద్దుకుంటే భారీగా లాభపడొచ్చన్న మైండ్ సెట్ అస్సలు కనిపించని తత్త్వం వైఎస్ సొంతం.

ఈ విలక్షణ మైండ్ సెట్ కారణంగానే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని భావించి.. ఎంతోమంది నేతలు తమ ఆస్తుల్ని తాకట్లు పెట్టి మరీ ఎన్నికల్లో ఖర్చు చేసిన ఉదంతాలెన్నో. ఆసక్తికరంగా అలా తన కోసం.. తాను ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు చేసిన వారందరికి వడ్డీ.. చక్రవడ్డీకి మించి సంపద క్రియేట్ అయ్యేలా చేసిన తీరు వైఎస్ లో కనిపిస్తుంది. తన రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కాదు.. తమ పార్టీలో తనతో విభేదించే వారు సైతం సాయం కోసం.. పనుల కోసం రావటమే ఆలస్యం..నో చెప్పకుండా ఓకే చెప్పే తీరు వైఎస్ సొంతం.

అలాంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా తెర మీదకు వచ్చిన వైఎస్ జగన్(jagan) డబ్బుల విషయంలో మహా కరకుగా ఉంటారని చెబుతారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి తీరుకు పూర్తి భిన్నంగా ఆయన తీరు ఉంటుందని చెబుతారు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా జగన్ తీరు ఉంటుందని చెబుతారు. ఈ కారణంగానే.. ఆయకు ఈ రోజున సొంత చెల్లెలు.. కన్నతల్లితో ఆస్తుల పంచాయితీ వచ్చి పడింది.

గడిచిన కొంతకాలంగా తల్లి విజయమ్మ.. చెల్లెలు షర్మిలతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆస్తుల పంచాయితీ అంతకంతకూ ముదురుతోంది. తాజాగా విజయమ్మ సంచలన లేఖను బయటపెట్టారు. తన ఆస్తుల్ని నలుగురు మనమలు.. మనవరాళ్లకు సమానంగా పంచాలన్నది వైఎస్సార్ ఉద్దేశం మాత్రమే కాదు ఆయన ఆదేశంగా ఆమె వెల్లడించారు. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సిందేనని విజయమ్మ స్పష్టం చేయటం గమనార్హం.

తాజాగా విజయమ్మ వాదన ప్రకారం చూస్తే.. షర్మిల(sharmila) హక్కుకు అనుగుణంగా చెందాల్సిన దాని కంటే తక్కువే జగన్ రాసినట్లుగా ఆమె ఆరోపించారు. ఆ మాటకు వస్తే యెలహంక భూమి కూడా షర్మిలదేనని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఆసస్తుల విషయంలో తన మేనకోడలికి, మేనల్లుడికి జగన్ ఇప్పటికే అన్యాయం చేశాడని..ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నట్లుగా పేర్కొన్న వైనం ఇప్పడు సంచలనంగా మారింది.

ఇదంతా చూసినప్పుడు ఏ డబ్బు కోసం జగన్ ఇంతలా తపిస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారుతుంది. ఇప్పటికే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారాన్నిఒకసారి సొంతం చేసుకున్న ఆయన.. తాజా పంచాయితీల పుణ్యమా అని తనఇమేజ్ కు జరిగే డ్యామేజ్ తో పోలిస్తే.. ఈ ఆస్తులు చాలా చిన్నవన్న విషయాన్ని ఆయన ఎందుకు గుర్తించటం లేదన్నది ప్రశ్న. తన తండ్రి ఏం ఆస్తులు ఉన్నాయని? ఆయన రాజకీయంగా ఓడిన ప్రతిసారీ అండగా నిలిచిన ఆయన అభిమానులు.. అభిమాన నేతలు ఆస్తుల్ని పణంగా పెట్టి మరీ వైఎస్ రాజకీయ ఎదుగుదలను కోరుకున్నారు.

అలాంటి అభిమానాన్ని సొంతం చేసుకోవాల్సిన జగన్.. సొంత చెల్లెలుతో మాత్రమే కాదు మేనల్లుడు.. మేనకోడలితో ఆస్తుల పంచాయితీపెట్టుకోవాల్సిన అవసరం ఉందా?అన్నది ప్రశ్న. డబ్బులు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. కానీ..బంధాలు.. అనుబంధాలు మాత్రం ఒకసారి పోతే రావు. డబ్బుతో అసలే రావు. ప్రేమాభిమానాలతో మాత్రమే వస్తాయన్నది మర్చిపోకూడదు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పే జగన్.. డబ్బు విషయంలో వైఎస్సార్ నడిచిన బాటలో జగన్ ఎందుకు నడవలేకపోతున్నారన్నది అసలు ప్రశ్న.

Tags
Jagan sharmila
Recent Comments
Leave a Comment

Related News