న్యూఢిల్లీ: వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఆయన డైలాగ్ చెబితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే. నందమూరి బాలకృష్ణ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. దశాబ్దాలుగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని తనదైన శైలిలో ఏలుతున్న నందమూరి సింహం ఇప్పుడు దేశ రాజధాని వేదికగా మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ` లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్` (Lifetime Achievement) పురస్కారం బాలయ్యను వరించింది.
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక భారత్ మండపంలో బుధవారం ప్రారంభమైన ` అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) 2026` వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ వేదికపై బాలకృష్ణ తనదైన గ్రేస్‌తో మెరిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకుంటున్న సమయంలో సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన బాలయ్య, ఈ అవార్డు అందుకోవడం నందమూరి అభిమానులకు అసలైన పండగను తీసుకువచ్చింది.
ఈ వేడుకలో కేవలం బాలకృష్ణ(Balakrishna) మాత్రమే కాదు, భారతీయ సినిమా దిగ్గజాలు షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు కూడా ఈ గౌరవం దక్కింది. అంటే, బాలయ్య రేంజ్ ఇప్పుడు జాతీయ స్థాయి దిగ్గజాల సరసన నిలిచిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, సినీ తారలు హేమమాలిని, కంగనా రనౌత్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది.
హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో రాణిస్తూనే, మరోవైపు సినిమాల్లో అన్ స్టాపబుల్ అనిపించుకుంటున్న బాలయ్యకు ఈ గౌరవం దక్కడంపై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య(Balayya) గర్జన ఢిల్లీలో వినిపించింది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు హంగామా చేస్తున్నారు.