మార్కాపురం బ‌స్ యాక్సిడెంట్.. మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

admin
Published by Admin — March 26, 2026 in Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం(Markapuram) జిల్లాలో తెల్లవారుజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే బస్సు అగ్నిగుండంగా మారింది. ఈ పెను ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవదహనం కావడం అత్యంత కలచివేసే అంశం. మరో 28 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

ఈ హృదయ విదారక ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న ఆయన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. `` మార్కాపురంలో జరిగిన ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం`` అంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తక్షణమే స్పందించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి బాధితులకు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందజేయనున్నారు. కాగా, ప్రమాద స్థలంలో దృశ్యాలు అత్యంత భీతావహంగా మారాయి. క్షణాల్లోనే అంతా బూడిదైపోవడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రభుత్వం తరపున సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తీరని లోటుగా మిగిలిపోయింది.

Tags
Markapuram Bus Accident Andhra Pradesh Bus Accident Markapuram AP News PM Narendra Modi
Recent Comments
Leave a Comment

Related News