అమరావతి రాజధానిపై మాజీ సీఎం జగన్ తన హయాంలో అనేక కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కారణంగానే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విమర్శిస్తుంటారు. అందుకే, ఈ సారి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు.
సభ ఆ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపేలాగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించారని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రజలందరి కోసమే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని, ఒక ప్రాంతం కోసం, కొంతమంది ప్రజల కోసం కాదని జనసేన నేత. మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇక, పవన్ నాయకత్వంలో కేంద్రం సహకారంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించిన గత పాలకులు ఆ తర్వాత మాట మార్చారని విమర్శించారు.