వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి నారా లోకేష్(lokesh) సెటర్లతో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబుకు సినిమా చూపిస్తానంటున్న జగన్‌కు.. ప్రజలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. అయి నప్పటికీ.. జగన్ తన పాదయాత్ర ద్వారా చంద్రబాబుకు సినిమా చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నా డని అన్నారు. కానీ.. జగన్ చూపించే సినిమా 11 రోజులు కూడా ఆడేలా లేదని సెటర్లు వేశారు.
అసెంబ్లీ() లాబీల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్.. కీలకమై రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంపై సభలో తీర్మానం ప్రవేశ పెడితే.. వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టారని.. ఇదేనా వారి చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. అమరావతికి వ్యతిరేకం కాదన్నవారు సభకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని ప్రజలు కోరుకుంటున్నారని.. అందుకే.. గత ఎన్నికల్లో కూటమిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలు ఏకగ్రీవంగా అమరావతికి మద్దతు పలుకుతున్నారని లోకేష్ అన్నారు. ఈ క్రమంలోనే అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చేందుకు.. జగన్ వంటి తుగ్లక్.. తుగ్లక్ చర్యలకు దిగకుండా చేసేందుకు.. రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 2న(గురువారం) పార్లమెంటులో ఈ తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో చట్టబద్దత కలుగుతుందన్నారు. అమరావతి తెలుగు వారి జీవనాడిగా శాశ్వత రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.