ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(pawan kalyan) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రతిపాదనకు సైతం నోచుకోని ప్రజల ఆకాంక్షలు.. నెరవేరే తరుణం వచ్చేసింది. అదే.. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో.. ప్రజలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న `పిఠాపురం రైల్వేస్టేషన్`కు మహర్దశ పట్టనుంది. ఈ స్టేషన్ నుంచి.. నిత్యం వందల మంది రోజు వారీ ఉద్యోగులతోపాటు.. పలువురు వ్యాపారులు.. ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తారు. ఇటు విజయవాడ, అటు రాజమండ్రి, సామర్లకోటకు ఈ స్టేషన్ ద్వారానే రాకపోకలు జరుగుతుంటాయి.
అయితే.. ఈ స్టేషన్‌లో మౌలిక సదుపాలు సరిగా లేవు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కూడా లేవు. ఈ స్టేషన్‌ను ఆధునీ కరించాలని.. మెరుగైన వసతులు కల్పించాలని.. అనేక సందర్భాల్లో ఇక్కడి వారు ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. అయితే.. ఈ విషయం ఎప్పటికప్పుడు తెరమీదికి రావడం.. ఆ వెంటనే మరుగున పడడం కామన్ అయిపోయింది. దీంతో పెద్దగా వసతులు లేని పిఠాపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు సమస్యలతోనే సవారీ చేస్తున్నారు. ఈ వ్యవహారం విషయం.. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది.
గత ఏడాది నుంచే..
గత ఏడాది పిఠాపురంలో పర్యటించినప్పుడు పవన్ కల్యాణ్‌కు ఇక్కడివారు.. రైల్వే స్టేషన్ సమస్యను వివరించారు. కొద్దిపాటి నిధులు కేటాయిస్తే.. వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయనం చేసిన ఉప ముఖ్యమంత్రి.. అదే ఏడాది పిఠాపురం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగాఅమలు చేస్తున్న `అమృత్ భారత్ స్టేషన్` పథకంలో చేర్చాలని అభ్యర్థించారు. దీనికిగాను ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. దీనిపై తాజాగా అప్‌డేట్ వచ్చింది.
పిఠాపురం రైల్వేస్టేషన్‌ను `అమృత్ భారత్ స్టేషన్` పథకం పరిధిలోకి చేరుస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటన జారీ చేసింది. దీనికి గాను దక్షిణ మధ్య రైల్వే శాఖ నిధుల నుంచి 37 కోట్ల 25 లక్షల రూపాయలను కేటాయించనున్నారు.. తద్వారా.. రైల్వే స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వైఫై సహా.. అధునాతన సీటింగ్, వెయింటింగ్ హాల్, తాగునీరు వంటి సకల సదుపాయాలు కల్పించనున్నారు. అంతేకాదు.. అమృత్ భారత్ పథకంలో చేరిన రైల్వే స్టేషన్‌కు మూడేళ్లపాటు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. సో.. మొత్తంగా పిఠాపురం వాసుల కలను పవన్ నెరవేర్చారు.