జమ్మలమడుగు రాజకీయ క్షేత్రం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కూటమిలో కీలక నేతగా, ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణంగా అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించాల్సిన స్థానంలో ఉన్న ఆయన, వ్యవస్థ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఏకంగా తన పదవికే ఎసరు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానిక రిపబ్లిక్ క్లబ్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను అనుకున్నట్లుగా వ్యవస్థ నడవకపోతే పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి పెద్ద బాంబు పేల్చారు. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, గత వంద రోజుల కిందటే దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చానని చెప్పడం గమనార్హం.
మంత్రిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు పదవుల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా గండికోట జలాశయ నిర్వాసితుల త్యాగాల పునాదుల మీద అనేక ప్రాంతాలకు నీళ్లు వెళ్తున్నాయని, కానీ ఆ త్యాగం చేసిన బాధితులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు రావాల్సిన పరిహారం, రాజోలి ప్రాజెక్టు నిర్మాణం, శ్రీశైలం(Srisailam) కుడి కాలువ పనులు, ఆర్టీపీపీలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల వంటి కీలక సమస్యల పరిష్కారం కోసం తాను అలుపెరగని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని, ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా తాను పదవిలో కొనసాగలేనని పరోక్షంగా ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.
కేవలం అభివృద్ధి పనులే కాకుండా కొన్ని రాజకీయ పరమైన చిక్కులు కూడా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో తనపై ఎన్నో కేసులు పెట్టి వేధించినా వెనకడుగు వేయలేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రజల కోసం రాజీనామా చేయడానికైనా వెనుకాడబోనని తేల్చి చెప్పారు. పార్టీ బలపడాలంటే మంచి చేసే వారికి సరైన గుర్తింపు ఉండాలని, వ్యవస్థలో మార్పు రానప్పుడు పదవుల్లో ఉండి ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా రాజీనామా అస్త్రాన్ని సంధించడంతో ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆదినారాయణరెడ్డి(Adinarayana Reddy) వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలేనా లేక భవిష్యత్తులో నిజంగానే ఆయన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.