బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్‌!

admin
Published by Admin — April 07, 2026 in Andhra
News Image

ఏపీలో బిజెపి శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చ‌రించారు. అంతేకాదు, పార్టీకి సైతం రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. పార్టీలో తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని, కనీసం తన మాట పట్టించుకునే వారు కూడా లేరని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో సంచలనంగా మారింది.

 

వాస్తవానికి గత కొన్నాళ్లుగా బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలకు బిజెపి రాష్ట్రస్థాయి నాయకత్వానికి మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న వాద‌న‌ కూడా వినిపిస్తోంది. అయితే ఇదేమీ లేదని అంతా బాగానే ఉందని పలువురు చెబుతున్నారు. కానీ ఇది వాస్తవం కాదన్నది ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతుంది. గత ఎన్నికలకు ముందు ఆదినారాయణ రెడ్డి బిజెపిలో చేరారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగు నియోజకవర్గంలో నుంచి టిక్కెట్ దక్కించుకున్న ఆయన కూటమి హవాలో విజయం సాధించారు.

 

అయితే వ్యక్తిగతంగా కూడా ఆదినారాయణ రెడ్డికి స్థానికంగా బలం ఉంది. బ‌లమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. దీనికి ముందు వైసీపీలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. బిజెపిలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకత్వంతో పాటు రాష్ట్రస్థాయి నాయకులతో కూడా ఆదినారాయణ రెడ్డికి గ్యాప్ పెరుగుతూ వెళ్తోంది. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం చక్రం తిప్పుతోందని తరచుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది.

 

పార్టీ తనకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని కనీసం తనను ఎమ్మెల్యేగా కూడా గుర్తించటం లేదన్నది ఆదినారాయణ రెడ్డి వాదన. దీనిపై రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇప్పటికీ పెద్దవి విప్పలేదు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. ప్రస్తుతానికైతే జమ్మలమడుగు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా కీలక నాయకులు వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనంగా మారింది.

Tags
Bjp mla adinarayana reddy Resign Warning
Recent Comments
Leave a Comment

Related News