తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు అత్యంత సంపన్నమైన అభ్యర్థిణిగా ఆమె పేరు మార్మోగిపోతోంది. ఆమె మరెవరో కాదు, తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న 58 ఏళ్ల లీమారోస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'లాటరీ కింగ్' మార్టిన్ సతీమణి అయిన ఆమె, తన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు చూసి రాజకీయ ఉద్దండులే నోరెళ్లబెడుతున్నారు. ఒక్కొక్కరి కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి.
కుబేర రాశిని తలపించే ఆభరణాలు ఆమె వద్ద ఉన్నాయి. లీమారోస్ సమర్పించిన వివరాల ప్రకారం, ఆమె వద్ద ఉన్న ఆభరణాల విలువే కొన్ని వందల కోట్లు ఉంటుంది. ఆమె పేరిట 19 కిలోల బంగారం - 1,217 క్యారెట్ల వజ్రాలు - 13 కిలోల వెండి - 33 గ్రాముల ప్లాటినం ఉన్నట్లు వెల్లడించారు. ఒక రాజకీయ అభ్యర్థి వద్ద ఈ స్థాయిలో వజ్రవైఢూర్యాలు ఉండటం దేశ రాజకీయ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
లీమారోస్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ. 1,049 కోట్లు (చరాస్తులు రూ. 139.63 కోట్లు, స్థిరాస్తులు రూ. 909.94 కోట్లు). ఇక ఆమె భర్త మార్టిన్ ఆస్తులు మరింత విస్తుగొలుపుతున్నాయి. ఆయన పేరిట సుమారు రూ. 4,149 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ ఆస్తులను కూడా కలిపితే, ఈ ఒక్క కుటుంబం వద్దే మొత్తం రూ. 6,000 కోట్లకు పైగా సంపద ఉంది. ఇంత సంపద ఉన్నా, లీమారోస్‌కు రూ. 8.57 కోట్ల అప్పులు ఉండటం గమనార్హం.
కేవలం ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్న లీమారోస్, తనపై 4 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అక్షరజ్ఞానం తక్కువైనా, వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తూ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలోనే అత్యంత సంపన్న అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచిన లీమారోస్, ఈ 'నోట్ల' బలాన్ని 'ఓట్ల' బలంగా మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. ఓటర్లు కేవలం సంపదకే పట్టం కడతారా లేక ప్రజా సేవను గుర్తిస్తారా అన్నది ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. ఏది ఏమైనా, ఈ లాటరీ కుటుంబం రాకతో తమిళనాడు ఎన్నికల రణక్షేత్రం ఒక్కసారిగా వేడెక్కింది.