సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక విజువల్ వండర్ అని నమ్మే దర్శకుడు అట్లీ(Atlee).. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజున ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు. వీరిద్దరి క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాకు ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బన్నీ ఒక భీకరమైన అవతారంలో దర్శనమివ్వడం వెనుక పెద్ద కథే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ పోస్టర్‌లో అందరినీ షాక్‌కు గురిచేసింది అల్లు అర్జున్ గుండు లుక్. ఒంటిపై వింత ఆకృతులు, చెవికి పోగులతో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఇది ఏదో సాధారణ యాక్షన్ సినిమా కాదని అర్థమవుతోంది. ఒక క్రూర మృగం చెయ్యి ఆయన ముఖాన్ని తాకుతున్నట్లు ఉన్న విజువల్, ‘రాకా’(RAAKA) అనే పేరుకు తగ్గట్లుగా రాక్షసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అసలు ఆ మృగం ఎవరు? బన్నీ శరీరంలోనే ఆ రాక్షస కోణం దాగి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రాకా’ చిత్రంలో అల్లు అర్జున్(Allu Arjun) ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అయితే ఇవి మామూలు తండ్రి-కొడుకు లేదా అన్నదమ్ముల పాత్రలు కావట. ఒకే మనిషిలోని మంచికి, క్రూరత్వానికి మధ్య జరిగే అంతర్యుద్ధమే ఈ కథాంశం అని తెలుస్తోంది. ఇప్పుడు విడుదలైన లుక్ ఆ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రదేనని సమాచారం. తనను తాను ఎదుర్కోవడమే ఈ సినిమాలోని అసలైన క్లైమాక్స్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో, దాదాపు 800 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. దీపికా పదుకొణే(Deepika Padukone) వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటితో పాటు రష్మిక, మృణాల్ వంటి స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.