విజ‌య్‌కు షాక్‌.. ఎన్నిక‌ల‌కు ముందే ఓ సీటు కోల్పోయిన TVK!

admin
Published by Admin — April 08, 2026 in Politics, National
News Image

తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని భావిస్తున్న దళపతి విజయ్(Thalapathy Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నికల నగారా మోగి, క్షేత్రస్థాయిలో ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో.. ఒక కీలక నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిత్వం రద్దవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా అభ్యర్థి నామినేషనే తిరస్కరణకు గురికావడంతో, పోలింగ్‌కు ముందే ఒక సీటును విజయ్ కోల్పోయినట్లయింది.

అన్నాడీఎంకే అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ప్రాతినిధ్యం వహిస్తున్న సేలం జిల్లాలోని ఎడప్పాడి నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ఈ ప్రతిష్టాత్మక స్థానంలో ఈపీఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని విజయ్ తన అభ్యర్థిగా అరుణ్ కుమార్‌ను బరిలోకి దింపారు. అయితే, నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారి పి. నటరాజన్ టీవీకే అభ్యర్థి దరఖాస్తును తిరస్కరించారు. నామినేషన్ పత్రాల్లో అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తుల వివరాలను ధృవీకరించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సాధారణంగా ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు వస్తాయని భావించి, రాజకీయ పార్టీలు ఒక ప్రత్యామ్నాయ (డమ్మీ) అభ్యర్థితో కూడా నామినేషన్ వేయిస్తాయి. కానీ, దురదృష్టవశాత్తూ ఎడప్పాడిలో టీవీకే(TVK) తరపున వేసిన ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా ఇదే కారణంతో వీగిపోయింది. దీనివల్ల ఇప్పుడు ఆ నియోజకవర్గంలో విజయ్ పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థే లేకుండా పోయారు.

రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన టీవీకేకు ఇది పెద్ద గుణపాఠం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నామినేషన్ పత్రాల దాఖలు వంటి అత్యంత కీలకమైన విషయంలో అప్రమత్తంగా లేకపోవడం పార్టీ లీగల్ టీమ్ వైఫల్యంగా కనిపిస్తోంది. ఇక తాజా పరిణామంతో సేలం(Salem) జిల్లాలోని టీవీకే కార్యకర్తలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. గెలుపోటముల మాట పక్కన పెడితే, కనీసం పోటీలో కూడా తమ పార్టీ అభ్యర్థి లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.  

Tags
Tvk Vijay Thalapathy Vijay Tamilaga Vettri Kazhagam TN Election 2026 Edappadi Palaniswami Salem Politics
Recent Comments
Leave a Comment

Related News