అది.. మంగళవారం సాయంత్రం.. ``ఈ రాత్రి ఇరాన్‌కు కాళరాత్రే.. అక్కడి నాగరికత ఇక అంతరించిపో తుంది.``- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇది. దీనికి కొనసాగింపుగా.. అమెరికా ఉ పాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం.. ``భయంకరమైన బదులిస్తాం. అధ్యక్షుడు `విశేష` నిర్ణయం తీసుకుంటా రు.`` అని చేసిన వ్యాఖ్య.. ప్రపంచాన్ని భయకంపితులను చేశాయి. దీనికికారణం.. ఇరాన్‌పై అణుయుద్ధా నికి అమెరికా సిద్ధమైందన్న సంకేతాలు.. ఈ రెండు ప్రకటనల్లోనూ గోచరించడమే!. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా.. అదేసమయంలో భయంభయంగా ఏనిమిషానికి ఏం జరుగుతుందో అని ఎదురు చూశాయి.
కట్ చేస్తే..
ఎలాంటి సంచలన నిర్ణయం.. ఎలాంటి సంచలన దాడులు లేకుండానే.. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు రెండు వారాల గడువు ఇస్తున్నట్టు తెలిపారు. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో శాంతి చర్చలు కూడా జరగనున్నాయని తెలిపారు. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించిందన్నారు. (దీనిని ఇరాన్ ధ్రువీకరించాల్సి ఉంది).
పాక్ మధ్యవర్తిత్వం..
ఇరాన్-అమెరికాల మధ్య పతాక స్థాయికి చేరిన యుద్ధంపై.. అలెర్ట్ అయిన పాకిస్థాన్ రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని ట్రంపే వివరించారు. ఇరాన్‌కు ఇచ్చిన గడువును పొడిగించాలన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించామని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. రెండు వారాల పాటు దాడులు నిలిపివేస్తున్నామని అంటూనే.. విధ్వంసక ఆయుధాలను కూడా పంపబోమని హామీ ఇచ్చారు.
భారత్ అలెర్ట్..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావొద్దని పేర్కొంది. ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని సూచించింది. ఇరాన్ నుంచి బయటకు రావాలని అనుకునే వారు కచ్చితంగా భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం.. 98 912 810 9115, 98 912 810 9102 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.