వినాశకర దాడులు చేస్తాం.. మీ నాగరికతను ఒక్కరాత్రిలో నాశనం చేస్తా.. ఇలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తీవ్ర హెచ్చరికలు.. అందుకు తాను చెప్పిన గడువునకు కాస్త ముందుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి వాతావరణం మారింది. అప్పటివరకు ఊపిరి బిగపెట్టుకొని కూర్చున్న ప్రపంచం కాస్తంత రిలాక్స్ అయ్యే పరిస్థితి. కాల్పుల విరమణకు తాము ఓకే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పటం.. అందుకు ప్రతిగా ఇరాన్ సైతం అంగీకరించటమే కాదు.. తమ పది పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ నకు పంపింది. దీనిపైనా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ పది పాయింట్ల మీద తదుపరి చర్చలు జరుగుతాయని ట్రంప్ సైతం చెప్పారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అందిన ఈ ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు ముందుకు వెళ్లేందుకు సాయం చేస్తుందన్న రీతిలో స్పందించారు. ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకోవటానికి ఏప్రిల్ 10న పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇంతకూ అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ ప్రతిపాదించిన పది పాయింట్ల శాంతి ప్రణాళికలో ఏముంది. అందులోని అంశాలను చూస్తే..
- భవిష్యత్తులో అమెరికా.. ఇజ్రాయెల్ మాపై మళ్లీ దాడులు చేయమని అధికారికంగా హామీ ఇవ్వాలి.
- హెర్ముజ్ జలసంధిపై నియంత్రణకు సంబంధించి ఇరాన్ తన నియంత్రణను కంటిన్యూ చేస్తుంది. అయితే.. పౌర నౌకల రాకపోకలకు కంట్రోల్ ట్రాన్సిట్ ఇస్తుంది.
- హెర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ప్రతి నౌక సుమారు 2 మిలియన్ డాలర్ల ఫీజు వసూలు చేస్తాం. ఆ ఆదాయాన్ని ఒమన్ తో పంచుకుంటాం.
- మా అణు కార్యక్రమం కోసం యురేనియంను సుసంపన్నం చేసే హక్కును అంతర్జాతీయ సమాజం ఆమోదించాలి.
- ఇరాన్ పై విధించిన అన్ని ప్రాథమిక.. ద్వితీయ ఆర్థిక ఆంక్షలను అమెరికా పూర్తిగా ఎత్తి వేయాలి.
- అమెరికా.. ఇతర దేశాల్లో స్తంభించేలా చేసిన ఇరాన్ నిధులను వెంటనే విడుదల చేయాలి.
- యుద్ధం కారణంగా ఇరాన్ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. లేదంటే పునర్నిర్మాణానికి నిధులు ఇవ్వాలి.
- మధ్యప్రాచ్యంలోని అన్ని సైనిక స్థావరాల నుంచి అమెరికా తన పోరాటదళాలను వెనక్కి తీసుకోవాలి.
- ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి.. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ కు వ్యతిరేకంగా గతంలో చేసిన తీర్మానాలన్ని రద్దు చేయాలి.
- ఇరాన్ తో మాత్రమే కాదు లెబనాన్.. యెమెన్ .. ఇరాక్ వంటి ప్రాంతాల్లో కూడా యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలి.