మూడుసార్లు సీఎం.. ఆస్తులు మాత్రం సున్నా!

admin
Published by Admin — April 10, 2026 in Politics, National
News Image

రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటేనే తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టడం అనే విమర్శలు వినిపించే ఈ రోజుల్లో, పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక అరుదైన మినహాయింపుగా కనిపిస్తున్నారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఆమె పాటిస్తున్న నిరాడంబరత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తాజాగా భవానీపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆమె సమర్పించిన ఆస్తుల అఫిడవిట్ చూసి సామాన్యులే కాదు, రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు.

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే కనీసం సొంత ఇల్లయినా ఉంటుందని ఎవరైనా ఊహిస్తారు. కానీ, మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఇప్పటికీ తనకంటూ ఒక సొంత ఇల్లు లేదు. అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్న కాళీఘాట్‌లోని చిరునామా కూడా ఆమె పేరిట రిజిస్టర్ కాలేదు. ఇక వాహనాల విషయానికి వస్తే, ఆమెకు కనీసం ఒక్క కారు కూడా లేకపోవడం గమనార్హం. కేవలం 9.8 గ్రాముల బంగారం, చేతిలో రూ. 75,700 నగదు మాత్రమే ఉన్నట్లు ఆమె ప్రకటించారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నా, కనీసం వ్యవసాయ భూమి కానీ, నివాస స్థలాలు కానీ ఆమె పేరిట లేవు.

సాధారణంగా ప్రజాప్రతినిధుల ఆస్తులు ఐదేళ్లలో రెట్టింపు అవ్వడం చూస్తుంటాం. కానీ, మమతా బెనర్జీ విషయంలో సీన్ రివర్స్ అయింది. 2021తో పోలిస్తే ఇప్పుడు ఆమె ఆస్తుల విలువ మరింత తగ్గడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2021లో ఆమె చరాస్తుల విలువ సుమారు రూ. 16.72 లక్షలుగా ఉండగా, తాజా నివేదిక ప్రకారం అవి మరింత క్షీణించాయి. రాయల్టీలు, బ్యాంక్ వడ్డీల ద్వారా వచ్చే ఆదాయమే తన ప్రాథమిక వనరుగా ఆమె పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆమెకు రూ. 40,600 టీడీఎస్ రిఫండ్ రావడం కూడా ఆమె సాధారణ ఆదాయానికి నిదర్శనంగా నిలుస్తోంది.

రాజకీయంగా ఆమె అనుసరించే వ్యూహాలు, నిర్ణయాలపై ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండవచ్చు.. కానీ, వ్యక్తిగత జీవితంలో ఆమె పాటిస్తున్న సింప్లిసిటీ మాత్రం అమోఘం. ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేశానని చెప్పుకునే నాయకులు మన దేశంలో చాలామంది ఉంటారు, కానీ ఆచరణలో మమతా బెనర్జీ వంటి వారు అరుదుగా కనిపిస్తారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోకుండా, దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రిగా నిలిచిన మమత తీరు.. ప్రస్తుత రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీస్తోంది. మరోవైపు బీజేపీ(BJP) మాత్రం  మమతా బెనర్జీ అన్నీ అబద్ధాలు చెబుతున్నార‌ని.. ఆమె వద్ద భారీగా ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తోంది.

Tags
Mamata Banerjee West Bengal Elections 2026 Didi TMC Bengal Polls Bengal Elections
Recent Comments
Leave a Comment

Related News