సెల్ఫీ అడిగితే స్మార్ట్‌ఫోన్ ఇచ్చేశాడు.. సంజూ నువ్వు కేక‌!

admin
Published by Admin — April 10, 2026 in National
News Image

సాధారణంగా అభిమానులు తన ఫేవరెట్ క్రికెటర్ కనిపిస్తే ఆటోగ్రాఫ్ లేదా సెల్ఫీ అడుగుతారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఒక సామాన్య అభిమాని అడగకుండానే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఏకంగా ఒక ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఆసక్తికర ఘటన కేరళలోని పాలక్కాడ్(Palakkad) జిల్లాలో చోటుచేసుకుంది. 

కడంపజిపురంకు చెందిన శబరీష్ అనే యువకుడు వృత్తిరీత్యా కేబుల్ టెక్నీషియన్, ప్రవృత్తిరీత్యా వికెట్ కీపర్. మంగళవారం సాయంత్రం క్రికెట్(Cricket) ప్రాక్టీస్‌కు వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న రేంజ్ రోవర్ కారులో తన ఆరాధ్య దైవం సంజూ శాంసన్‌ను చూశాడు. ఇంకేముంది.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన శబరీష్, ఎలాగైనా ఒక సెల్ఫీ తీసుకోవాలని సంజూ దగ్గరికి వెళ్లాడు.

శబరీష్ సెల్ఫీ తీయడానికి తన ఫోన్ పైకి ఎత్తగా, ఆ ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉండటాన్ని సంజూ గమనించాడు. ఫోటో సరిగ్గా రావడం లేదని, ఫోన్ కూడా పని చేయడం లేదని గ్రహించిన సంజూ.. వెంటనే తన కారు డిక్కీలో ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్(Smartphone) ను తీసి ఇచ్చేశారు. `` నీ ఫోన్ డిస్‌ప్లే పాడైంది కదా.. ఇది నీ కోస‌మే`` అని సంజూ ఆప్యాయంగా చెప్ప‌డంతో..  ఆ కుర్రాడి కళ్లలో నీళ్లు తిరిగాయి.

సుమారు రూ. 40,000 విలువ చేసే ఆ కొత్త ఫోన్‌ను చూసి శబరీష్ మొదట సంశయించినా, సంజూ ప్రేమగా పట్టుబట్టడంతో కాదనలేకపోయాడు. కేవలం ఫోన్ ఇవ్వడమే కాకుండా, శబరీష్ ఒక వికెట్ కీపర్ అని తెలుసుకున్న సంజూ.. `` క్రికెట్ బాగా ఆడు`` అని వీపు తట్టి ప్రోత్సహించి అక్కడి నుంచి బయలుదేరాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. సంజూ ఉదారతపై నెట్టింట ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. "నిజమైన హీరో అంటే నువ్వే బాసూ", "అందుకే నిన్ను అందరూ అంతగా ప్రేమిస్తారు" అంటూ నెటిజన్లు సంజూను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తానికి సంజూ శాంసన్(Sanju Samson) సిక్సర్లతోనే కాదు, తన మానవత్వంతో కూడా అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాడు.

Tags
Sanju Samson Cricket News Humanity Indian Cricket Kerala Palakkad
Recent Comments
Leave a Comment

Related News