కూటమి ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజలను తప్పదారి పట్టించేందుకు విపక్ష వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గురవారం ఎక్స్ ఖాతా వేదికగా ఓ సంచలనానికి తెర లేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ తమ విలాసాల కోసం జనం సొమ్ము వాడుకుంటున్నారని, రూ. 176 కోట్లతో కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పించింది.
వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాక రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెలికాప్టర్ల పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. తాజాగా ఏపీ సర్కార్ సైతం సీఎంతో పాటు ప్రముఖుల కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ల సామర్థ్యం పై నివేదిక కోరుతూ కమిటీని నియమించింది. ఇదే అంశాన్ని ఆసరాగా తీసుకున్న వైసీపీ `జనం సొమ్ముతో బాబు కొడుకులు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు రూ.172 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని వారి విలాసాల కోసం వాడతారు.` అని ఆరోపిస్తూ పోస్ట్ పెట్టింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెజారిటీ పీపుల్ వైసీపీపైనే సెటైర్లు వేస్తున్నారు. `రూ. 172 కోట్లు ఖర్చుపెట్టి హెలికాప్టర్ కొన్నారని మీరు ఎలా చెప్తున్నారు.. డాక్యుమెంట్ ప్రూఫ్ ఉందా?` అని ప్రశ్నిస్తున్నారు. `రుషికొండలో రెస్ట్ తీసుకోవడానికి జగన్ రూ. 500 కోట్లు ఖర్చు పెట్టాడు..దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ` అని మరికొందరు విమర్శిస్తున్నారు. ఒక నెటిజన్ `మీరు సిద్ధం సభలకు పెట్టిన ఖర్చు ఎంత? హెలికాప్టర్ కి కట్టిన అద్దె ఎంత? ప్యాలెస్ లకు పెట్టిన ఖర్చు ఎంత? లిక్కర్ స్కాంలో మీరు కొట్టేసింది ఎంత?` అంటూ వైసీపీ పోస్ట్ కింద ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఇక మరోవైపు వైసీపీ పోస్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సమగ్ర విచారణ జరిపి నిజమేంటో స్పష్టం చేసింది. చంద్రబాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేశారని వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. ప్రభుత్వంపై బురద జల్లడానికి ఇటువంటి ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను హెచ్చరించింది.