మ్యాగజైన్ స్టోరీ: చంద్రబాబు కు ‘భూ’ముప్పు!!

News Image

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోయిందన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఉంది. రీసర్వే పేరిట నాటి సీఎం జగన్‌, ఆయన పార్టీ నాయకులు.. లక్షల మంది రైతుల భూములు స్వాహా చేశారు. సర్వే నంబర్లలో రైతుల భూములు తీసేసి తమ ఖాతాల్లో వేసుకున్నారు. దరిదాపుగా 8,680 గ్రామాల్లో 3.80 లక్షల మంది రైతుల భూములు వైసీపీ నేతల పాలయ్యాయి. అన్నదాతలు గగ్గోలు పెట్టినా జగన్‌ వినిపించుకోలేదు సరికదా.. ఆ భూములు వైసీపీ నేతల చేజారకుండా ఏకంగా చట్టమే తెచ్చారు. దీనివల్లే మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నారు. కోల్పోయిన వారి భూములు వారికి ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సర్వే తప్పులపై సివిల్‌ కోర్టుల్లో అనేక కేసులు పడ్డాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల సంఖ్యలో బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి జనం బారులు తీరారు. స్వయంగా ముఖ్యమంత్రినే కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఉపయోగం లేదు. పైగా జగన్‌ చేసిన తప్పులనే కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. రీసర్వే పేరిట మళ్లీ పైలట్‌ ప్రాజెక్టులు చేపడుతోంది. వందల గ్రామాల్లో తిరిగి సర్వే అంటున్నారు. అసలు డాక్యుమెంట్లు అన్నదాతల చేతుల్లోనే ఉన్నాయి. వాటి ఆధారంగా భూవివాదాలను పరిష్కరించకుండా మళ్లీ సర్వే చేపట్టడం వెనుక ఉద్దేశమేంటో అర్థం కావడం లేదు. ప్రజల భూముల జోలికి వెళ్లిన జగన్‌ గతి ఏమైందో ప్రత్యక్షంగా చూసి కూడా చంద్రబాబు ఎందుకు తప్పుటడుగులు వేస్తున్నారో రెవెన్యూ నిపుణులకు అంతుపట్టడం లేదు. అప్పుడేం జరిగింది..? జగన్‌ సర్కారు రాష్ట్రమంతా రీ సర్వే అమలు చేయడానికి ముందు తొలుత 1,500 ఎకరాలున్న ఉమ్మడి కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టారు. చిన్న గ్రామంలోనే విజయం సాధించలేకపోయారు. ఎక్కడ లోపాలున్నాయో కనిపెట్టి సరిదిద్దకుండా ఏకంగా 8,680 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేసి 3.80 లక్షల మంది రైతుల భూములు తారుమారు చేసేశారు. వారి ఉసురు పోసుకున్నారు. ఇది టీడీపీ కూటమికి ఎన్నికల్లో బాగానే ఉపకరించింది. అధికారంలోకి వస్తే రైతుల భూ వివాదాలు తీరుస్తామని హామీ ఇచ్చింది. రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో సభలు నిర్వహిస్తే 2.60 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇవి సరిపోవన్నట్లుగా రెవెన్యూ సదస్సుల్లో మరో 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా వివిధ రూపాల్లో గత ఎనిమిది నెలల్లో 7.60 లక్షల ఫిర్యాదులు వస్తే అందులో ఒక్క రెవెన్యూ సంబంధితమైనవే 3.80 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ జగన్‌ సర్కారు చేసిన రీ సర్వేపై వచ్చిన ఫిర్యాదులే. అంటే చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రజాసమస్యల్లో సింహభాగం జగన్‌ సర్కారు చేసిన తప్పిదాల వల్ల వచ్చినవే. అవి రైతాంగాన్ని ఎంత ఇబ్బందులకు గురిచేస్తున్నవో సర్కారుకు బాగా తెలిసినవే. ఒకసారి వాటి తీవ్రత, లోతుపాతులు తెలిసిన తర్వాత మరే ప్రభుత్వం అలాంటి తప్పుల జోలికే వెళ్లదు. అలాంటి సాహసాలు చేయదు. కానీ అదేం చిత్రమో.. చంద్రబాబు సర్కారు ఆ దోవలోనే పయనిస్తోంది. జగన్‌ ఒక గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టు చేపడితే.. తాను ఏకంగా 670 గ్రామాల్లో చేస్తోంది. రాష్ట్రంలో జగన్‌ జమానాలో రీ సర్వే చేసింది ఇప్పుడున్న రెవెన్యూ, సర్వే అధికారులు, సిబ్బందే. ఇప్పుడు సర్వే చేస్తోందీ వారే. ఇక మారిందేమిటి? ప్రభుత్వమే! ప్రజానుకూలంగా సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాలనే గుణాత్మకమైన మార్పు అధికారగణంలో తీసుకురాకుండా వారి ద్వారా కూటమి ప్రభుత్వం భూ వివాదాలు ఎలా పరిష్కరిస్తుంది? సమస్యలు లేకుండా ఎలా సర్వే చేస్తుందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. పరిష్కారంపై తప్పుడు నివేదికలు జగన్‌ చేసిన భూసంబంధిత తప్పులు లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే పుణ్యకాలం గడచిపోతుంది. ప్రతి రైతు సమస్యను పరిష్కరించాలంటే మళ్లీ సర్వేచేయాలి. అంటే భూమిపై కొలతలు వేయాలి. రైతు ఆమోదం పొందాలి. అంతిమంగా మళ్లీ చట్టబద్ధమైన వివిధ రకాల నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవన్నీ సగటున ఒక్కో గ్రామంలో పూర్తవ్వాలి. అంతిమంగా 8,680 గ్రామాల్లో భూ వివాదాలు పరిష్కారం కావాలంటే.. ఎప్పటికి పూర్తవుతుందో అంచనా వేయడమే కష్టం. ఇవన్నీ అధికారులను క్షేత్రస్థాయికి పంపించి ఒక్కో కేసును నిశితంగా పరిశీలించి పరిష్కరించాల్సినవి. అలాంటిది కేవలం నాలుగైదు నెలల్లోనే 80 శాతం ఫిర్యాదులు పరిష్కారమని రెవెన్యూ శాఖ తేల్చేసింది. భూములు తారుమారై తమ నేల పరులపాలై అన్నదాతలు, జనం అల్లాడుతుంటే.. ఏకంగా 80 శాతం సమస్యలు తేల్చేశామని ఆ శాఖ ఇచ్చిన నివేదికలో ఎంత డొల్లతనం ఉందో ఇట్టే చెప్పవచ్చు. ఆ శాఖ తెంపరితనంపై రెవెన్యూ నిపుణులు, చట్టాలు, విధానాలపై అవగాహన ఉన్న సీనియర్‌ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారుకు మాత్రం ఇసుమంతైనా అనుమానం, సందేహం కలగడం లేదు. అధికారులను నమ్మాల్సిందే కానీ.. ప్రభుత్వం అధికారులను నమ్మాలి. ఇందులో సందేహం లేదు. కానీ జగన్‌ ఇదే అధికారులను అడ్డుపెట్టుకుని భూముల సర్వేను స్వార్థ ప్రయోజనాలకు, భూదోపిడీకి అడ్డగోలుగా వాడుకున్నారు. మాట వినని రాజకీయ ప్రత్యర్థులు, తనకు ఓటేయరని భావించిన రైతులు, సామాన్యుల భూ రికార్డులను మార్చేశారు. ఇవన్నీ నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు తెలియనివి కాదు. జగన్‌ సర్కారు రీ సర్వే పేరిట దారుణాలు చేసిందని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆందోళనలు కూడా చేశారు. అధికారంలోకి రాగానే రీ సర్వే ఆపేశారు. రీ సర్వే అనంతరం జగన్‌ తన బొమ్మలతో ఇచ్చిన పాస్‌పుస్తకాలను ఆపేశారు. సర్వే సరిహద్దు రాళ్లపై జగన్‌ బొమ్మలను తొలగిస్తున్నారు. కానీ మళ్లీ అధికారులు చెప్పారంటూ తిరిగి 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభించారు. పాత సమస్యలు పరిష్కరించకుండా కొత్తగా లక్షల సమస్యలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా అన్న అనుమానాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు ఎప్పుడూ ప్రజలకు సమస్యలు ఉండాలనే కోరుకుంటారు. ప్రజల సమస్యలే వారి అక్రమార్జనకు, అవినీతికి మేత. కీలక పదవులు, హోదాల్లో తిష్ఠవేసి అందినంత దోచేస్తుంటారు. రెవెన్యూ శాఖలో ఇలాంటి వారే అధికం. భూముల సర్వేకు ముందు రెవెన్యూలో రికార్డుల నిర్వహణ మాత్రమే ఉండేది. రికార్డుల్లో తప్పులున్నాయని, ఇతరుల పేరిట భూములు మార్చారన్న ఫిర్యాదులు 25 శాతం లోపే ఉండేవి. అధికారిక రియల్‌టైం గవర్నెన్స్‌ సిస్టమ్‌ ‘ఆర్టీజీఎస్‌) లెక్కల ప్రకారం.. జగన్‌ అధికారంలోకి రాకముందు 2019 జనవరి నాటికి ప్రభుత్వానికి 1.45 లక్షల ఫిర్యాదులు వస్తే, అందులో రెవెన్యూశాఖ పరిష్కరించాల్సినవి 13 వేలు. ఇందులో అత్యధికం చుక్కల భూములు, కౌలురైతు కార్డులు, మ్యుటేషన్‌ సమస్యలే. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో 70 శాతం రెవెన్యూవే. వాటిలో సింహభాగం రీ సర్వేపై వచ్చినవే. అదే ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో, న్యాయంగా, ధర్మంగా పరిష్కరించడం లేదు. అవసరం లేని కొర్రీలు, సాకులు చూపి రైతులను నిరంతరం తిప్పించుకుంటారు. డబ్బులిస్తేనే పనవుతుందని సంకేతాలిస్తారు. ప్రజలు ఒక ఆస్తిని కాపాడేందుకు మరో ఆస్తిని అమ్ముకుని వచ్చిన డబ్బును సదరు అధికారికి సమర్పించుకుని సమస్యను పరిష్కరించుకునే పరిస్థితులు కోకొల్లలు.

Previous News Next News

Related News