హేమ‌ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ.. ఐర‌న్ లెగ్ ముద్ర పోతుందా..?

admin
Published by Admin — April 12, 2026 in Politics, Andhra
News Image

సినీ న‌టి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు హేమ మ‌ళ్లీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమెకు రాజ‌కీయాలు కొత్త‌కాదు. 2014 స‌మ‌యంలో ఆమె అప్ప‌టి సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) పెట్టిన `జై స‌మైక్యాంధ్ర‌` పార్టీ త‌ర‌ఫున ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని మండ‌పేట‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. కానీ, డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. కానీ.. నిరుత్సాహ ప‌డ‌కుండా.. హేమ‌ ఆ త‌ర్వాత కూడా పొలిటిక‌ల్ ఎంట్రీకి ప్ర‌య‌త్నించారు. కానీ, తూర్పులోని స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ముఖ్య నాయ‌కుడు.. అడ్డు ప‌డ్డార‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

అయితే.. ఇప్పుడు స‌ద‌రు నేత వృద్ధుడు కావ‌డం.. యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో పాటు.. పార్టీ ప‌రంగా కూడా కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగేందుకు హేమ(Hema) ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఇది ఆమె ఆకాంక్ష మాత్ర‌మే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. ఆమె ఆకాంక్ష నెర‌వేరుతుందో లేదో చూడాలి. కాగా.. అటు సినీరంగంలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే హేమ‌పై ఆ మ‌ధ్య కాలంలో బెంగ‌ళూరులో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీ తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది.

ఆమెపై కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఫైర్ బ్రాండ్ న‌టిగా కూడా హేమ‌ పేరు తెచ్చుకున్నారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే తీవ్ర వ్యాఖ్య‌లు.. పోస్టుల‌పై త‌ర‌చుగా ఆమె స్పందిస్తారు. అదేస‌మ‌యంలో అత్యాచారం వంటి కేసుల విష‌యంలోనూ.. మహిళా హ‌క్కుల‌పైనా ఆమె స్పందిస్తారు. ఇక‌, గ‌తంలో జై స‌మైక్యాంధ్ర పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆమెకు వైసీపీ(YCP) నుంచి ఆహ్వానం అందింది. దీంతో హైద‌రాబాద్ నుంచి వ‌చ్చి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో ఆమె చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. కానీ, ఏమైందో ఏమో ఆత‌ర్వాత మ‌ళ్లీ మౌనం పాటించారు.

కాగా.. రాజ‌కీయాల్లో హేమ‌ ఒక్క‌సారే పోటీచేసినా.. ఆమెపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌స్తుతం ఆమె రావాల‌ని భావిస్తున్న కూట‌మి పార్టీ.. ఏమేర‌కు ఈ సెంటిమెంటును ప‌ట్టించుకోకుండా హేమ‌ను చేర్చుకుంటుందో చూడాలి. అయితే.. వాక్ చాతుర్యం.. ఫైర్ బ్రాండ్ స్థాయి వాద‌న వంటివి ఆమె సొంతం కావ‌డంతో రాజ‌కీయాల్లో ఆమెకు, ఆమె వ‌ల్ల పార్టీల‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌న్న వాద‌న ఉంది. ఇక‌, ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags
Actress Hema Tollywood AP Politics Andhra Pradesh Hema Political Reentry
Recent Comments
Leave a Comment

Related News

Latest News