వాహనాల్ని స్వాధీనం చేసుకునే పవర్ పోలీసులకు లేదు

admin
Published by Admin — April 12, 2026 in Telangana
News Image

తాగేసి వాహనాన్ని(vehicles) నడిపే వారిని పోలీసులు(police) పట్టుకోవటం.. ఈ క్రమంలో వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. అయితే.. అలాంటి ప్రత్యేక అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. మోటారు వాహనాల చట్టం ప్రకారం తాగేసి వాహనాన్ని నడుపుతుంటే తమ స్వాధీనం లోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదని చెప్పిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్ పత్రాలు.. గుర్తింపు పత్రాల రుజువు.. డ్రైవింగ్ లైసెన్సు సమర్పించినంతనే వాహనాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

దీనికి సంబంధించిన పలు సూచనలు.. మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో.. తాగి వాహనం నడిపే వారి వాహనాన్ని స్వాధీనం చేసుకునే పవర్ పోలీసులకు లేదని స్పష్టమైంది. తన మహీంద్రా ఎక్స్ యవీ 500వాహనాన్ని అల్వాల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్.. సబ్ ఇన్ స్పెక్టర్ గతంలో కోర్టు ఇచ్చిన న్యాయస్థానాల తీర్పునకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూకట్ పల్లికి చెందిన జె. విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు తన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనల్ని వినిపిస్తూ.. పిటిషనర్ వాహనాన్ని నడుపుతుండగా.. కారులోని మరో వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని.. ఈ కారణాన్ని చూపిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్ సమయంలో ఏం చేయాలన్న దానిపై 2021లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు. హోంశాఖ తరఫు ఏజీపీ వాదనలు వినిపిస్తూ.. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడపటంలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకునే నాటి నుంచి పిటిషనర్ పత్రాలతో పోలీసులను సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనల్ని విన్న న్యాయమూర్తి కీలక మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఇందులో వాహనాన్ని తమ అదుపులో ఉంచుకున్న పోలీసులు.. మరే ఇతర అధికారి అయినా సదరు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.. డ్రైవింగ్ లైసెన్స్ కు సమర్పించిన తర్వాత దాని యజమానికి.. లేదంటే ఎవరికైనా అప్పగించాలని పేర్కొంది.

ఒకవేళ డ్రైవర్.. వాహన యజమానిపై న్యాయపరమైన చర్యలు అవసరమని పోలీసులు భావిస్తే.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీనుంచి మూడు రోజుల్లోపు సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట వారిపై చార్జిషీట్ దాఖలు చేయాలి. అవన్నీ సరిగా ఉంటే.. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి మూడు రోజుల్లోపు చార్జిషీట్ ను స్వీకరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ 2021లో కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. అందుకు కారణమైన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ పిటిషన్ ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags
Vehicles police drunk and drive Rules
Recent Comments
Leave a Comment

Related News