తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల(tamilnadu assembly elections) ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు(cm chandrababu) పాల్గొన్నారు. కోయంబత్తూరులో నేడు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళంలో తన స్పీచ్(tamil speech) మొదలుబెట్టిన చంద్రబాబు...తలైవా రజనీకాంత్(rajanikanth) డైలాగ్ అర్థమైందా రాజా అంటూ అదరగొట్టారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లు చాలా దగ్గరి స్నేహితులని గుర్తు చేసుకున్నారు. వారిద్దరూ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారని గుర్తుచేశారు.
చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో చాలామంది ప్రజలు తమిళం మాట్లాడతారని, తన వివాహం చెన్నైలో జరిగిందని గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనతోనే నదుల అనుసంధానం సాధ్యమన్నారు. తమిళుల ప్రయోజనాలు పట్టని పార్టీలకు ఓటు వేయొద్దని, తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న తమిళనాడు డీఎంకే పాలనలో వెనుకబడిపోయిందని విమర్శించారు.
"గడచిన ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి ఆగిపోయింది. తమిళనాడుకు అప్పులు పెరిగాయి, యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు, నేరాల రేటు పెరిగిపోయింది. డీఎంకే పాలనలో తమిళ ప్రజల మధ్య విబేధాలు, విద్వేషాలను రగిల్చారు. కేంద్రం లక్షల కోట్ల రూపాయలు అందిస్తున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో డీఎంకే విఫలమైంది. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం చారిత్రక అవసరం’’ అని చంద్రబాబు అన్నారు.