తెలంగాణ(Telangana) జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు గులాబీ కోటలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగిత్యాల వేదికగా సాగిన రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ఆమె చేసిన విమర్శలు, పరోక్షంగా తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌నే టార్గెట్ చేశాయనే చర్చకు దారితీస్తున్నాయి. 75 ఏళ్ల వయసు పైబడిన నేతలే నవ యువకులని, వారే రాష్ట్రానికి దిక్కని చెప్పడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
వయసు మళ్లిన నేతలే యువతకు ప్రతినిధులుగా చలామణి అవ్వాలని చూడటం హాస్యాస్పదమని కవిత మండిపడ్డారు. "రాష్ట్రంలోని యువత అంతా చచ్చిపోయారా? బ్రతికున్నారా? వారి భవిష్యత్తు ఏంటి?" అంటూ ఆమె సంధించిన ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. పరోక్షంగా కేసీఆర్ రాజకీయ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందనే సంకేతాలను ఆమె ఇచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధ నేతలే పీఠాలను పట్టుకుని వేలాడటం యువత ఆకాంక్షలను వెక్కిరించడమేనని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
అదేవిధంగా గులాబీ దళంలో అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిందని, ముఖ్యంగా మహిళా నేతలకు అక్కడ కనీస గుర్తింపు లేదని కవిత కుండబద్దలు కొట్టారు. పార్టీ కేవలం కొందరి గుత్తాధిపత్యంగా మారిందని, కొద్దిమంది సొంత లాభాల కోసమే నిర్ణయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల పరాజయానికి అసలైన కారణాలను విశ్లేషించాల్సింది పోయి.. సామాన్య కార్యకర్తలపై, ప్రజలపై నెపం నెట్టడం కేసీఆర్ స్థాయికి తగదని హెచ్చరించారు. ఉద్యమ కాలం నుంచి జెండా మోసిన అసలైన నాయకులను విస్మరించి, అధినేత చుట్టూ చేరిన కోటరీ భజన వల్లే పార్టీ పునాదులు కదులుతున్నాయని కవిత(Kavitha) నిప్పులు చెరిగారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై కూడా కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రేవంత్ రెడ్డి పదేళ్ల పాలనపై ధీమా వ్యక్తం చేయడాన్ని ప్రశ్నిస్తూ.. అది ప్రజలు నిర్ణయించాల్సిన విషయం అని గుర్తు చేశారు. ఒక ఆడబిడ్డగా, కొత్త తరహా రాజకీయాలతో మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి అంటూ ఆమె విన్నపం చేశారు.