పిఠాపురం సెగ.. అధినేతల మాట వినరా?

admin
Published by Admin — April 21, 2026 in Politics, Andhra
News Image

అమరావతి(Amaravati) నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే మాట.. ఒకే బాట అన్నట్లుగా సాగుతున్నారు. కానీ, పిఠాపురం కోటలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. అగ్ర నేతల మధ్య ఉన్న కెమిస్ట్రీ క్షేత్రస్థాయి నేతల మధ్య మిస్ అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏదైనా శుభకార్యం జరిగితే కలిసి అడుగులు వేయాల్సిన కూటమి నేతలు, చిన్న ఫ్లెక్సీ విషయంలో వీధికెక్కడం చర్చనీయాంశమైంది. అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని టీడీపీ(TDP) శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇది కేవలం ఫోటోల గొడవ మాత్రమే కాదు.. నియోజకవర్గంలో ఆధిపత్యం ఎవరిది అనే అంతర్గత యుద్ధానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్థానిక టీడీపీ నేత వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలో చిచ్చు రేపుతున్నాయి. "పిఠాపురం(Pithapuram)లో టీడీపీ పునాదులు బలంగా ఉన్నాయి కాబట్టే 70 వేల మెజార్టీ సాధ్యమైంది.. మేము లేకపోతే ఫలితం మరోలా ఉండేది" అంటూ ఆయన చేసిన కామెంట్స్, జనసేన నేతలకు ఆగ్రహం తెప్పించాయి. తాము ఎక్కడి నుంచో దత్తత రాలేదని, క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని వర్మ గట్టిగానే స్పష్టం చేశారు.

అయితే వర్మ వ్యాఖ్యలకు జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వర్మ మొదటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు(Chandrababu) దగ్గర మార్కులు కొట్టేయడానికే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా, వర్మకు సంబంధించి అనేక చీకటి కోణాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని దొరబాబు చేసిన హెచ్చరికలు పిఠాపురంలో ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఎన్నికల సమయంలో కలిసి పనిచేసి చరిత్ర సృష్టించిన ఈ రెండు పార్టీల నేతలు, ఇప్పుడు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంది. పవన్(Pawan), బాబు ఇద్దరూ కలిసి పకడ్బందీగా పాలన సాగిస్తుంటే, పిఠాపురంలో నేతలు ఇలా వ్యవహరించడంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరి ఇప్పటికైనా అగ్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఈ విభేదాలకు ఫుల్‌స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.

Tags
Pithapuram Politics TDP Janasena Pawan Kalyan Chandrababu Naidu SVSN Varma AP Politics
Recent Comments
Leave a Comment

Related News