ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం బంపర్ ఆఫర్.. ఇక సమ్మె ముగిసినట్టేనా?

admin
Published by Admin — April 22, 2026 in Telangana
News Image

తెలంగాణ‌(Telangana)లో ఉద‌యం నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండ‌టంతో హైటెన్ష‌న్ నెల‌కొంది. స‌మ్మె కార‌ణంగా సామాన్య ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, కార్మికుల ఆవేదన మధ్య రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే సంకేతాలు ఇస్తూనే, సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్మికులు లేవనెత్తిన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం 32 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 29 అంశాల పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. "సమస్యలకు సమ్మె మాత్రమే మార్గం కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం" అని మంత్రి పేర్కొంటూ, కార్మికులకు స్నేహపూర్వక హస్తాన్ని అందించారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలకు చెక్ పెడుతూ, కేవలం నాలుగు వారాల్లోనే పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు.

ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అత్యంత కీలకమైన 'ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం', 'గుర్తింపు సంఘాల ఎన్నికలు' వంటి అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాజనకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో చర్చించి, త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ సానుకూలతను గమనించి, పంతాలకు పోకుండా విధుల్లో చేరాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

నిరుపేద ప్రజలు రవాణా సౌకర్యం లేక పడుతున్న అవస్థలను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జేఏసీ నేతలు తమ నిరసనలను ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగించుకోవచ్చని, అయితే సాధారణ కార్మికులు మాత్రం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే బస్సులు తీయాలని కోరారు. మ‌రి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ డిమాండ్లకు అంగీకరించిన నేపథ్యంలో ఆర్టీసీ(RTC) చక్రం మళ్లీ తిరుగుతుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

 

Tags
Minister Ponnam Prabhakar RTC Strike Telangana Telangana RTC CM Revanth Reddy TGSRTC
Recent Comments
Leave a Comment

Related News