అమరావతి: ఆంధ్రప్రదేశ్(Amdhra Pradesh) రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో సాగుతున్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక్క చట్టంతో శాశ్వత పరిష్కారం చూపింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చట్టం చేయడం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026’ ద్వారా అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది.
సాధారణంగా రాజధాని నిర్ణయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశంగా భావిస్తారు. కానీ, ఏపీ(AP) విషయంలో గతంలో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ ఏకంగా చట్టాన్ని సవరించింది. 2024 జూన్ 2 నుండే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించడంతో.. గతంలో వినిపించిన 'మూడు రాజధానుల' ప్రతిపాదనలు చట్టబద్ధంగా కాలి బూడిదయ్యాయి. ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి హోదాను మార్చడం అసాధ్యమనేలా కేంద్రం స్పెషల్ పవర్స్ ఇచ్చింది.
రాజధాని ఖరారుతో పాటు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. మార్కాపురం, పోలవరం(Polavaram).. ఈ రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. ఈ నూతన సరిహద్దులతో కూడిన అధికారిక మ్యాప్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేశాయి.
కేంద్ర ప్రభుత్వం తన రికార్డుల్లోనూ, భారత అధికారిక మ్యాప్‌లోనూ అమరావతి(Amaravati)ని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అప్‌డేట్ చేసింది. దీనివల్ల అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు, మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమమైంది. కేవలం కాగితాల మీద రాజధానిగా కాకుండా, పార్లమెంట్ చట్టం రక్షణ ఉన్న నగరంగా అమరావతికి ఇప్పుడు గ్లోబల్ డిమాండ్ పెరగనుంది.
