సాధారణంగా భక్తులు దేవుడి దగ్గరికి వెళ్తారు, కానీ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శైలే వేరు. ఆయన దగ్గరికే దేవుడు రావాలి, ఆశీర్వచనాలు నడవాలి. నేను రాజ్యాంగ పదవిలో ఉన్నానా? లేదా? అన్నది ఆయనకు అనవసరం. పది నిమిషాల దూరంలో ఉన్న ఒంటిమిట్ట(Ontimitta) కోదండరామాలయానికి వెళ్లి మొక్కు తీర్చుకునే తీరిక లేకనో, లేక అంతటి వినయం రాకనో కానీ.. ఏకంగా అర్చకులనే తన ప్యాలెస్‌కు పిలిపించుకున్నారు. భక్తిలో కూడా ఈ హోమ్ డెలివరీ కాన్సెప్ట్ ప్రవేశపెట్టిన జగన్ తీరు ఇప్పుడు అర్చకుల పాలిట శాపంగా మారింది.
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోనో, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికో అందజేయాల్సిన శేష వస్త్రాలు, రాములోరి తోమాల సేవ వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సామాన్య ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి కోసం బయటకు తీసుకురావడం ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చ. జగన్(Jagan) అనుచరుల ఒత్తిడో, లేక అయ్యగారి ఆజ్ఞో తెలియదు కానీ, పాపం ఆ అర్చకులు మాత్రం నిబంధనలను గాలికి వదిలేశారు. ఆఖరికి ఆ పవిత్ర వస్తువులను ఒక వ్యక్తి ప్రైవేట్ నివాసానికి తీసుకువెళ్లి, అక్కడ ఆయనకు రాజభోగాలు కల్పించడం చూస్తుంటే.. ధర్మ పరిరక్షణ కంటే, జగన్ ప్రసన్నమే ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించారని అర్థమవుతోంది.

జగన్ భక్తిని లోకానికి చాటి చెప్పాలని ఆరాటపడ్డ వైసీపీ సోషల్ మీడియా టీం, ఈ తతంగం మొత్తాన్ని వీడియోలు తీసి వైరల్ చేసింది. కట్ చేస్తే.. ఆ అత్యుత్సాహమే ఇప్పుడు అర్చకుల మెడకు చుట్టుకుంది. ఈ వీడియోలు టీటీడీ(TTD) అధికారుల దృష్టికి వెళ్లడంతో, సీన్ రివర్స్ అయ్యింది. నిబంధనలను అతిక్రమించినందుకు గాను సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు అందాయి. జగన్ రాజకీయం కోసం, ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం ఇప్పుడు ఆ అమాయక అర్చకులు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మొత్తానికి తన రాజకీయ లబ్ధి కోసం హిందూ సంప్రదాయాలను, ఆలయ మర్యాదలను పావులుగా వాడుకోవడం జగన్‌కు అలవాటేనని ఈ ఒంటిమిట్ట ఘటన మరోసారి నిరూపించింది.