పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు(Akividu)లోని ప్రభుత్వ భూమిలో మతపరమైన కట్టడాల నిర్మాణంపై సాగుతున్న వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా హైకోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జోక్యం చేసుకోవడం, దానిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించడం సంచలనంగా మారింది.
సాధారణంగా తనదైన శైలిలో వాదనలు వినిపించే రఘురామకృష్ణం రాజు(Raghurama Krishnam Raju) కు ఈసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసులో వ్యక్తిగతంగా తన వాదనలు వినిపించేందుకు ఆయన ప్రయత్నించగా, ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. "ఏ హోదాలో మీరు వాదనలు వినిపిస్తారు?" అని ప్రశ్నించడమే కాకుండా, న్యాయస్థానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని గట్టిగా మందలించింది. మీ పరిధి దాటి ప్రవర్తించవద్దు అంటూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కోర్టు హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని నింపాయి. న్యాయమూర్తుల ఆగ్రహాన్ని గమనించిన రఘురామ, తదుపరి వాదనలు వినడానికి కోర్టు సుముఖంగా లేకపోవడంతో అక్కడి నుండి వెనుదిరగాల్సి వచ్చింది.
పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు(Supreme Court) గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదని గుర్తు చేశారు. ఆకివీడులో నిబంధనలకు విరుద్ధంగా, పోలీసుల అండతో పాత కట్టడాలను కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, అక్కడ దశాబ్దాలుగా రామాలయం ఉందని, దానికి అన్ని అనుమతులు ఉన్నాయని రఘురామ తరపు న్యాయవాది వాదించినప్పటికీ, కోర్టు మాత్రం ప్రస్తుతానికి నిబంధనలకే ప్రాధాన్యత ఇచ్చింది.
ఈ వివాదంపై ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద విచారణ జరుగుతున్నందున, పూర్తిస్థాయిలో వాస్తవాలను అక్కడే తేల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. వివాదాస్పద స్థలంలో ఉన్నది అసలు గొంతెనమ్మ గుడినా లేక రామాలయమా? అన్న చారిత్రక అంశాలను, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. సంచలనం సృష్టించిన ఈ పిల్ ను ముగిస్తూనే, తక్షణమే ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకు(Raghurama) కోర్టులో ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.