రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే.. కానీ సిద్ధాంతం అనేది సొంత గొంతుక. ఇప్పుడు కవిత సరిగ్గా ఇదే బాటలో పయనిస్తున్నారు. తన తండ్రి పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూనే, ఒక రాజకీయ నేతగా ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం తెలంగాణ(Telangana) రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. "నా తండ్రి కేసీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు.. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధానాలతోనే నాకు సమస్య" అని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి.
"నా ఉనికికి మూలం నా తండ్రి.. ఆయన లేకపోతే నేను లేను" అంటూనే కవిత తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఒక కుమార్తెగా తండ్రి ఆరోగ్యం, క్షేమం కోరుకోవడం తన బాధ్యతని, కానీ ఒక రాజకీయ నాయకురాలిగా కేసీఆర్(KCR) అనుసరిస్తున్న ప్రస్తుత విధానాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె కుండబద్దలు కొట్టారు. ఇక్కడ పోరాటం తండ్రి మీద కాదు, బీఆర్ఎస్ అధినేత తీసుకున్న ‘జాతీయ రాజకీయ’ నిర్ణయాల మీద అని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
తెలంగాణ సెంటిమెంట్‌ను పక్కనపెట్టి, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్(BRS)గా మార్చడం ద్వారా కేసీఆర్ తన మూలాలను విస్మరించారనేది కవిత ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షలను జాతీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా ‘తెలంగాణ రక్షణ సేన’(Telangana Rakshana Sena) అనే వేదికను సిద్ధం చేసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకుడిగా కేసీఆర్ ఐడియాలజీకి, తన రాజకీయ లక్ష్యాలకు మధ్య పొంతన లేదని చెప్పడం ద్వారా ఆమె తన స్వతంత్ర రాజకీయ ప్రస్థానానికి పునాది వేశారు.
కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలను కొట్టిపారేస్తూనే.. ఇది కేవలం రాజకీయ చైతన్యంతో తీసుకున్న నిర్ణయమని కవిత(Kavitha) పేర్కొన్నారు. కేసీఆర్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఆమె ఎత్తిన జెండా, రాబోయే రోజుల్లో ఏ తీరాలకు చేరుతుందో చూడాలి. ఏదేమైనా, సమస్య వ్యక్తితో కాదు.. సిద్ధాంతంతోనే అని కవిత చెప్పిన మాటలు రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపాయి.