ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన సీఎంలు వీళ్లే..!

admin
Published by Admin — May 05, 2026 in Politics, National
News Image

భారత రాజకీయాల్లో ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి తిరుగులేని నాయకుడు. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును శాసించే శక్తి. అలాంటి పీఠంపై కూర్చున్న వ్యక్తులు, సామాన్య ఎమ్మెల్యే(MLA) అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోవడం అనేది అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ పెను సంచలనం సృష్టిస్తుంది. అయితే ప్రజాతీర్పు ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి ఈ ముఖ్యమంత్రుల ఓటములే నిదర్శనం.

మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగిన మమతా బెనర్జీ (Mamata Banerjee) కి 2026 అసెంబ్లీ ఎన్నికలు కోలుకోలేని దెబ్బ తీశాయి. 2021లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన చరిత్ర ఉన్నప్పటికీ, ఈసారి 2026లో కూడా ఆమె తన నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. బెంగాల్‌లో ఈసారి బీజేపీ ప్రభంజనం ముందు ఆమె ఓటమి చెందడం, ఆమె పార్టీ (TMC) అధికారాన్ని కోల్పోవడం దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపుగా నిలిచింది. వరుసగా రెండు ప్రధాన ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఉండి ఓడిపోవడం మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

ఎన్.టి. రామారావు (ఆంధ్రప్రదేశ్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్(NTR) 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల (హిందూపూర్, కల్వకుర్తి) పోటీ చేశారు. హిందూపూర్‌లో గెలిచినప్పటికీ, కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కూడా కోల్పోయింది.

శిబూ సోరెన్ (జార్ఖండ్): ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండగా, తమర్ నియోజకవర్గం నుంచి జరిగిన ఉప ఎన్నికలో శిబూ సోరెన్(Shibu Soren) ఓడిపోయారు. దీనివల్ల ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

హరీష్ రావత్ (ఉత్తరాఖండ్): 2017లో ముఖ్యమంత్రిగా ఉన్న హరీష్ రావత్(Harish Rawat) హరిద్వార్ రూరల్, కిచ్చా అనే రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఓడిపోయారు.

సిద్ధరామయ్య (కర్ణాటక): 2018 ఎన్నికల్లో సిట్టింగ్ సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) రెండు చోట్ల పోటీ చేశారు. బాదామిలో గెలిచినప్పటికీ, తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు.

పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ సిట్టింగ్ సీఎంగా ఉంటూ ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధామి ఓటమి 2022లో పాలయ్యారు. అయినప్పటికీ, బీజేపీ(BJP) అధిష్టానం ఆయననే మళ్ళీ సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన గెలిచారు.

చరణ్ జిత్ సింగ్ చన్నీ (పంజాబ్): 2022లో ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్ జిత్ సింగ్ చన్నీ(Charanjit Singh Channi)పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్) ఓడిపోయారు.

ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు): తమిళనాడులో ఈసారి ఊహించని ఫలితాలు వచ్చాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) అనూహ్యంగా 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదే స‌మ‌యంలో డిఎంకే అధినేత, సిట్టింగ్ సీఎం ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి పాలయ్యారు. TVK పార్టీ అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో స్టాలిన్ ఓడిపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

Tags
Election Results Indian Politics CM Defeats India Elections NTR Mamata Banerjee MK Stalin
Recent Comments
Leave a Comment

Related News