`CM`గా రాజీనామా చేయను.. దీదీ సంచ‌ల‌నం!

admin
Published by Admin — May 05, 2026 in Politics, National
News Image

పశ్చిమ బెంగాల్(West Bengal) రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, బీజేపీ స్పష్టమైన ఆధిక్యత సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పంతాన్ని వీడడం లేదు. తన ఓటమిని అంగీకరించేది లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ(Mamata Banerjee) నిప్పులు చెరిగారు. "మేము ఓడిపోలేదు, మా గెలుపును కుట్రపూరితంగా అడ్డుకున్నారు" అంటూ ఆమె మండిపడ్డారు. సుమారు 100 నియోజకవర్గాల్లో ఫలితాలను బీజేపీ హైజాక్ చేసిందని ఆమె ధ్వజమెత్తారు. "ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు.. యంత్రాంగం సృష్టించిన మాయాజాలం" అని ఆమె విమర్శించారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల్లో జరిగిన పరిణామాలు, ఈసీ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 90 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి మాయం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

కేంద్ర బలగాల పహారాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మమత ఆరోపించారు. చివరకు కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న తన కారుపైనే దాడులకు తెగబడ్డారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన చెందారు. కేవలం ఆరోపణలతోనే ఆగకుండా, ఎన్నికల్లో జరిగిన అవకతవకలను నిరూపించడానికి 15 మంది సభ్యులతో ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి న్యాయపోరాటానికి దిగాలని ఆమె నిర్ణయించుకోవ‌డం గమనార్హం.

బీజేపీ(BJP)కి 207 సీట్లు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నా, టీఎంసీని 80 సీట్లకే పరిమితం చేయడం వెనుక ఉన్న గూఢచారి రాజకీయాన్ని తాము ఎండగడతామని దీదీ స్పష్టం చేశారు. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, మరోవైపు మమత రాజీనామాకు నిరాకరించడం బెంగాల్‌ను రాజ్యాంగ సంక్షోభం దిశగా నెడుతోంది. ఈ రాజకీయ చదరంగంలో దీదీ వేయబోయే తదుపరి ఎత్తుగడపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

Tags
West Bengal Election 2026 Mamata Banerjee Bengal Results Didi TMC BJP Bengal Politics
Recent Comments
Leave a Comment

Related News