పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ పన్నెండేళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టడం అంత సులభం కాదని గ్రహించింది. అందుకే, పక్కా ప్రణాళికతో ఈ సారి వ్యూహ రచన చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత, దీదీ నియంత పోకడ, మంత్రుల అవినీతి...వంటి పలు కారణాలతో దీదీ కంచుకోటను బద్దలు కొట్టింది బీజేపీ. అయితే, ఎస్ ఐఆర్ (SIR) వల్లే ఈ ఫలితాలు వచ్చాయని, ఈ ఓటమిని తాను అంగీకరించడం లేదని దీదీ తేల్చి చెప్పేశారు. అంతేకాదు, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని మంకుపట్టు పట్టారు.
ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ దీదీ సుప్రీం కోర్టుకు వెళ్లి స్వయంగా తన వాదనలు కూడా వినిపించారు. అయినా సరే ఫలితం లేకపోయింది. కావాలనే లక్షల ఓట్లు తొలగించారని, అందువల్లే ఓడిపోయామని సీఈసీ, బీజేపీలపై దీదీ ఫైర్ అయ్యారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, బీజేపీ (BJP) కుట్ర వల్లే ఫలితాలు తారుమార అయ్యాయని ఆమె సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బెంగాల్ పాలిట సీఈసీ జ్ఞానేష్‌కుమార్ విలన్ అని,100 సీట్లు బీజేపీకి దోచిపెట్టారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
ఎన్నికల ఫలితాల అనంతరం తనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారని, ఇండి కూటమిలోనే టీఎంసీ ఉందని అన్నారు. ఇండి కూటమిని మరింత బలోపేతం చేస్తామని, ఎస్ఐఆర్ (SIR) పేరుతో 90 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. బీజేపీ ఓట్ల చోరీపై పోరాడతామని, లోక్‌భవన్ కు వెళ్లే ప్రసక్తే లేదని, సీఎం పదవికి రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు.
అయితే మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందేనని మే 7వ తేదీ లోపు సెక్రటేరియట్ ఖాళీ చేయాలని బిజెపి ఎమ్మెల్యే సువేందు అధికారి డెడ్లైన్ విధించారు. మరోవైపు దీదీ రాజీనామా చేయబోను అని మంకు పట్టు పడితే గవర్నర్ తన పూర్తిస్థాయి విచక్షణ అధికారాలు ఉపయోగించి ఆమెను బర్తరఫ్ చేసే అవకాశం ఉంది.