విజయ్‌కు కాంగ్రెస్ జై.. సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే?

admin
Published by Admin — May 06, 2026 in Politics, National
News Image

తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొడుతూ, వెండితెర దళపతి విజయ్ ఇప్పుడు రాష్ట్ర పగ్గాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి అనూహ్యంగా హస్తం పార్టీ మద్దతు ప్రకటించడంతో ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారిపోయాయి.

ఇన్నాళ్లూ డీఎంకే(DMK)కు నమ్మకమైన మిత్రుడిగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు విజయ్‌తో చేతులు కలపడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఎన్డీయే కూటమికి దూరంగా ఉండాలనే ప్రధాన షరతుతో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విజయ్ క్యాబినెట్‌లో రెండు మంత్రి పదవులను కూడా కాంగ్రెస్ ఆశిస్తుండటం గమనార్హం.

మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, విజయ్ టీవీకే పార్టీ తొలి పోరులోనే సొంతంగా 108 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు కాంగ్రెస్‌(Congress)కు ఉన్న 5 సీట్లు తోడవ్వడంతో ఆ బలం 113కి చేరింది. మెజారిటీకి ఇంకా ఐదు సీట్ల దూరంలో ఉన్న విజయ్.. వీసీకే, సీపీఐ వంటి చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ మద్దతు కూడగట్టుకోవడం దాదాపు ఖాయం కావడంతో, ఈనెల 7న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంద‌ని తెలుస్తోంది. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం డీఎంకే-కాంగ్రెస్ మధ్య ఉన్న దశాబ్దాల బంధాన్ని తెంచేసింది. దీనిపై డీఎంకే వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌ది వెన్నుపోటు రాజకీయమని డీఎంకే ప్రతినిధి శరవణన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకే మద్దతు లేకుండా కాంగ్రెస్ కనీసం ఆ ఐదు సీట్లు కూడా గెలిచేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా, విజయ్(Vijay) రాకతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోందని అర్థమవుతోంది.

Tags
Tamil Nadu Elections 2026 CM Vijay TVK Thalapathy Vijay Tamil Nadu Politics Congress DMK
Recent Comments
Leave a Comment

Related News