ఏపీ కేబినెట్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అగ్నిపరీక్ష పెట్టారు. మొన్నటివరకు సింగపూర్‌లో ప్రపంచస్థాయి పరిపాలనపై పాఠాలు నేర్చుకున్న మంత్రులు.. ఇప్పుడు ఆ విద్యను క్షేత్రస్థాయిలో ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రులతో భేటీ అయిన బాబు, కేవలం పర్యటన అనుభవాలతో సరిపెట్టకుండా.. రిజల్ట్ కావాలి అంటూ కఠినమైన డెడ్ లైన్ విధించారు. రాబోయే 100 రోజుల్లో ప్రతి శాఖలోనూ విప్లవాత్మక మార్పులు కనిపించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాబు సంకేతాలిచ్చారు.
ముఖ్యమంత్రి రూపొందించిన ఈ రోడ్ మ్యాప్‌లో అత్యంత కీలకమైన అంశం త్రీ చేంజెస్ ఫార్ములా. తాము సందర్శించిన విభాగానికి సంబంధించి కనీసం మూడు వినూత్న మార్పులను ప్రతిపాదించడమే కాకుండా, వాటిని నిర్ణీత గడువులోగా అమలు చేసి చూపాలి. ముఖ్యంగా జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ సిటీ కాన్సెప్టులను ఏపీ(AP) వాతావరణానికి అనుగుణంగా ఎలా మలుచుకుంటారనే దానిపై మంత్రుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
గత ప్రభుత్వ హయాంలో పాలన గాడి తప్పిందని, పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని బాబు తన మంత్రులకు గుర్తు చేస్తున్నారు. సింగపూర్ తరహాలో రెడ్ కార్పెట్ పరిపాలనను అందించి, పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించడమే ఈ టాస్క్ ప్రధాన ఉద్దేశ్యం. ఫైల్ క్లియరెన్స్‌లో జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని, ప్రతి పైలు కదలికలోనూ పారదర్శకత ఉండాలని సీఎం(CM) స్పష్టం చేశారు.
ఈ పర్యటనపై విపక్ష వైసీపీ(YCP) చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలంటే కేవలం మాటలు సరిపోవని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సింగపూర్ ఏజెన్సీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవల్‌లో రిజల్ట్ రాబట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ 100 రోజుల డెడ్ లైన్ మంత్రులకు ఒక సవాల్ లాంటిదే. మరి చంద్రబాబు పెట్టిన ఈ కఠిన పరీక్షలో ఎంతమంది మంత్రులు నెగ్గుతారో చూడాలి!