భాగ్యనగరం వేదికగా జరిగిన ఒక అధికారిక కార్యక్రమం కాస్తా.. దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మాదాపూర్‌లోని ‘హెచ్‌ఐసీసీ’ వేదికగా తెలంగాణకు సుమారు రూ. 9,377 కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలను అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi), అదే వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక అనూహ్యమైన ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనబెట్టి తమతో కలిసి నడవాలని ప్రధాని పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగిస్తూ ఒక కీలకమైన పాత జ్ఞాపకాన్ని గుర్తుచేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో సహకరించారని రేవంత్ పేర్కొన్నారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ తమకు అండగా నిలవాలని, పెద్దన్న పాత్ర పోషించాలని రేవంత్ రెడ్డి ఆత్మీయంగా కోరారు. తాము అభివృద్ధి విషయంలో రాజకీయం చేయబోమని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి వైపు చూస్తూ.. "నా మాట శ్రద్ధగా వినండి" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో గుజరాత్(Gujarat)కు ఎంత బడ్జెట్ ఇచ్చామో, తెలంగాణకూ అంతే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూనే.. ఒక ట్విస్ట్ ఇచ్చారు. "ఒకవేళ గుజరాత్‌కు ఇచ్చినట్లే తెలంగాణకూ ఇస్తే.. రాష్ట్రానికి సగం నిధులే అందుతాయి. మరి ఆ నిధులు మీకు సరిపోతాయా?" అంటూ మోదీ నవ్వుతూనే సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము గుజరాత్ కంటే ఎక్కువే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని మోదీ ఈ సందర్భంగా ఇచ్చారు.
పక్షపాతాలు లేకుండా తెలంగాణ(Telangana)ను తాము ఎలా ప్రోత్సహిస్తున్నామో మోదీ గణాంకాలతో సహా వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్ వెయ్యి కోట్ల లోపే ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం తెలంగాణ కోసమే ఏడాదికి రూ. 5,500 కోట్లు కేటాయిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 15 వేల కోట్ల రైల్వే పనులు నడుస్తున్నాయని, ఇప్పటికే 5 వందే భారత్, 6 అమృత్ భారత్ రైళ్లను అందించామని చెప్పారు. దేశం ముందుకు వెళ్లాలంటే తెలంగాణ అభివృద్ధి చెందడం ఎంతో కీలకమని, అందుకే కలిసి పనిచేద్దామంటూ రేవంత్ సర్కారుకు మోదీ సూచనలు చేశారు.