పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మే 8న ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు నమోదైన కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తనయుడు బండి భగీరథ్ ప్రధాన నిందితుడు. పోక్సో చట్టం కింద కేసు నమోదై రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ ఆయన అరెస్ట్ కాకపోవడం పెను సంచలనంగా మారింది. అసలు భగీరథ్ ఎక్కడ ఉన్నారు? ఆయన ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారా లేక 'ఒత్తిడి' వల్ల మౌనం వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. భగీరాథ్ అరెస్ట్ లో జరుగుతన్న జాప్యంపై అందరూ సీఎం రేవంత్ రెడ్డి వేపే వేళ్లు చూపిస్తున్నారు.
పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న భగీరథ్(Bandi Bhagirath), మరోవైపు చట్టపరమైన వెసులుబాటు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు బాధితురాలు న్యాయం కోసం ఎదురుచూస్తుంటే, నిందితుడు మాత్రం తనను తాను రక్షించుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై పౌర సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేక సాంకేతిక అంశాల సాకుతో విచారణ ఆలస్యమవుతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కేసులో ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోందని ప్రతిపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సామాన్యుడు చిన్న తప్పు చేస్తే క్షణాల్లో అరెస్ట్ చేసే పోలీసులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి విషయంలో ఎందుకు వెనుకాడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ పెరుగుతోంది.
పోక్సో కేసు అంటేనే అత్యంత కఠినమైన చట్టం. అలాంటి కేసులో నిందితుడు తప్పించుకు తిరగడం వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోంది. రాజకీయ వైరం ఏమైనా ఉన్నా, ఒక ఆడపిల్ల విషయంలో జరిగిన అన్యాయంపై రాజీ పడకూడదన్నది సామాన్యుల వాదన. హైకోర్టు ముందస్తు బెయిల్ పై ఇచ్చే తీర్పు, అలాగే తెలంగాణ(Telangana) పోలీసులు భగీరథ్‌ను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనే అంశాలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.