ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్‌జెండర్‌.. ఏపీ స‌ర్కార్ అరుదైన గౌర‌వం!

admin
Published by Admin — May 13, 2026 in Politics, Andhra
News Image

సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అడుగడుగునా వివక్ష, వెలివేతలను ఎదుర్కోవడమే వారి నిత్యకృత్యం. అయితే, గుంటూరుకు చెందిన జీవన్‌కుమారి (Jeevan Kumari) ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి ఒక కొత్త చరిత్రను లిఖించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వద్ద పీఏగా బాధ్యతలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డులో సభ్యురాలిగా నియమితులయ్యారు. ఒక ట్రాన్స్‌జెండర్ అధికారిక పాలనలో భాగస్వామి కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన  పరిణామం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandhrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ బోర్డును ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బోర్డులో అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన ఉన్న జీవన్‌కుమారి వంటి వారికి చోటు కల్పించడం విశేషం. ఆమెతో పాటు కోట ప్రేమ్‌సాగర్‌ రాయ్, బోను దుర్గలు సభ్యులుగా ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల గొంతుకగా మారనున్నారు. ఈ బోర్డు రెండేళ్ల పాటు విధుల్లో ఉండి, విద్యా, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రావాల్సిన హక్కుల కోసం పనిచేయనుంది.

ఇటీవలే ఎమ్మెల్యే గల్లా మాధవి(MLA Galla Madhavi)తో కలిసి జీవన్‌కుమారి మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఆ సమయంలో వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి, సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే, అతి తక్కువ కాలంలోనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అందులో జీవన్‌కుమారికి చోటు కల్పించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తన పీఏకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేస్తూ, ఇది కేవలం జీవన్‌కుమారికి దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, వివక్షపై పోరాడుతున్న ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

ఈ నియామకం ద్వారా ఏపీ (AP) ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలను పంపింది. ట్రాన్స్‌జెండర్లను కేవలం ఓటర్లుగా చూడకుండా, వారిని సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు ఈ బోర్డు ఒక వేదిక కానుంది.  ట్రాన్స్‌జెండర్ల హక్కులను పరిరక్షించడం.. ప్రభుత్వ పథకాలు వారికి నేరుగా అందేలా చూడటం.. విద్యా సంస్థలు, కార్యాలయాల్లో వారికి భద్రత, గౌరవం కల్పించడం.. ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి భరోసా ఇవ్వడమే ఈ బోర్డు ప్ర‌ధాన ఉద్ధేశం.  

Tags
Andhra Pradesh Transgender MLA Galla Madhavi Jeevan Kumari AP Politics Nara Lokesh
Recent Comments
Leave a Comment

Related News