టాలీవుడ్(Tollywood) గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని కొందరు చేస్తున్న పన్నాగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో ఏకంగా రూ. 100 కోట్ల విరాళాల సేకరణకు తెరలేపడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ముదరకముందే తారక్ ఆఫీస్ రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్త హల్చల్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్(NTR) రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని, అందుకే ఇప్పటి నుంచే ఆయన పేరుతో భారీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని కొందరు అభిమానులు ప్రచారం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏకంగా రూ. 100 కోట్ల నిధిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజల నుంచి, ఎన్టీఆర్ శ్రేయోభిలాషుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ భారీ వసూళ్ల వ్యవహారం ఎన్టీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. తన పేరుతో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు ఎన్టీఆర్ కార్యాలయం(NTR Office) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఎన్టీఆర్ పేరు చెప్పి కొంతమంది విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇటువంటి వసూళ్లకు, ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇవి ఆయన అనుమతితో జరుగుతున్నవి కావు" అని ఖరాకండిగా తేల్చి చెప్పింది.
సాధారణంగా హీరోల పుట్టినరోజులకు లేదా సినిమాల విడుదలకు అభిమానులు రక్తదాన శిబిరాలు, అన్నదానాలు చేయడం సహజం. కానీ, ఏకంగా వంద కోట్ల రూపాయల విరాళం అంటే అది మామూలు విషయం కాదు. ఇందులో కేవలం అభిమానం మాత్రమే ఉందా? లేక ఎన్టీఆర్ పేరు చెప్పి ఎవరైనా కేటుగాళ్లు భారీ దోపిడీకి ప్లాన్ చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల రేపు తారక్ ఇమేజ్‌కు ఎక్కడ భంగం కలుగుతుందోనన్న ఉద్దేశంతో ఆయన టీమ్ ముందస్తుగా అడ్డుకట్ట వేసింది.
తనను ప్రేమించే అభిమానులు ఎవరూ ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఎన్టీఆర్(NTR) కోరారు. "ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా, అధికారిక ప్రకటనలు ఇవ్వాలన్నా నేరుగా నా కార్యాలయం నుంచే వస్తాయి. అంతవరకు ఎవరూ ఇటువంటి ఊహాగానాలను నమ్మవద్దు" అని ప్రకటనలో స్పష్టం చేశారు. దీంతో ఈ రూ. 100 కోట్ల విరాళాల హడావుడికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లయింది.