రాజ్యసభలో వైసీపీ ‘పవర్’ కట్.. 40 రోజుల్లో కథ ఖతం!

admin
Published by Admin — May 14, 2026 in Politics, Andhra
News Image

నిన్నటి వరకు ఢిల్లీ(Delhi) రాజకీయాల్లో చక్రం తిప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలు నెరపుతూ, పార్లమెంటులో కీలక బిల్లుల ఆమోదంలో కీల‌కంగా వ్యవహరించిన వైసీపీ బలం ఇప్పుడు క్రమంగా కరుగుతోంది. కేవలం 40 రోజుల వ్యవధిలో ఆ పార్టీ తన రాజ్యసభ బలాన్ని కోల్పోబోతోంది. ఫలితంగా దేశ రాజధానిలో జగన్ మార్క్ పాలిటిక్స్‌కు గట్టి బ్రేక్ పడనుందనే చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం రాజ్యసభ(Rajya Sabha)లో వైసీపీకి ఏడుగురు సభ్యుల బలం ఉంది. అయితే, వచ్చే నెల 21వ తేదీతో ముగ్గురు కీలక సభ్యుల పదవీకాలం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీలు పెద్దల సభ నుంచి నిష్క్రమించనున్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ సభ్యుడైనప్పటికీ, ఆయన మొదటి నుంచి బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ముగ్గురి పదవీకాలం ముగియనుండటంతో వైసీపీ బలం నాలుగుకే పరిమితం కానుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవ్వడం ఆ పార్టీ పార్లమెంటరీ భవిష్యత్తును దెబ్బతీసింది. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం.. ఖాళీ అవుతున్న ఈ మూడు రాజ్యసభ స్థానాలు ఏకపక్షంగా అధికార కూటమి (TDP-JSP-BJP) ఖాతాలోకి వెళ్లడం ఖాయం. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయిలో వైసీపీ సీట్లు ఉండటంతో, కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. దీనివల్ల రాజ్యసభలో వైసీపీ బలం తగ్గడమే కాకుండా, కూటమి పార్టీల బలం పెరిగి ఢిల్లీలో వారి హవా పెరగనుంది.

గత ఐదేళ్లుగా రాజ్యసభలో వైసీపీ(YCP)కి ఉన్న సంఖ్యాబలం కారణంగానే కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఆ పార్టీకి ప్రాధాన్యత ఇచ్చేది. విభజన హామీలైనా, రాష్ట్ర నిధులైనా వైసీపీ ఎంపీల బలాన్ని చూపే జగన్ సాధించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. నలుగురు ఎంపీలతో కేంద్రం వద్ద మునుపటిలా డిమాండ్ చేసే శక్తి వైసీపీకి ఉండకపోవచ్చు. 2029లో తిరిగి అధికారంలోకి వస్తే తప్ప, ఈ లోపు మళ్ళీ రాజ్యసభ సీట్లు సాధించుకోవడం ఆ పార్టీకి అసాధ్యంగా కనిపిస్తోంది. మొత్తానికి, ఏపీ అసెంబ్లీలో మొదలైన పతనం ఇప్పుడు ఢిల్లీ దాకా పాకింది. ఒకప్పుడు పార్లమెంటులో గంభీరంగా వినిపించిన వైసీపీ వాయిస్, రాబోయే రోజుల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి!

Tags
YSRCP Rajya Sabha Andhra Pradesh YS Jagan AP Politics Delhi Politics Parliament
Recent Comments
Leave a Comment

Related News