సంపద సృష్టికి ఏపీ కేంద్రంగా మారుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నిడమర్రు గ్రామంలో `బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్` సంస్థ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపనను సీఎం చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతోందని తెలిపారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక తయారు కావాలన్నది తన లక్ష్యమని.. అప్పుడు రాష్ట్రానికి, దేశానికి కూడా ఏపీ సంపద సృష్టి కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఈ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో గతంలో చాలా తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని.. తాను తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు దేశానికే మెడికల్ హబ్ గా హైదరాబాద్ తయారైందని చెప్పారు.
అమరావతి రాజధాని పరిధిలో విద్య, వైద్యంలో తిరుగు స్థాయి నెలకొంటుందని.. 23 ఎకరాల్లో కాలేజీ, 2 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోందని తెలిపారు. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్యం అందించేలా సంస్థ ఏర్పాటు కానుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్లు చాలా అవసరం ఉందన్న ఆయన.. డాక్టర్ కూడా ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.
అరాచకాలు గుర్తు పెట్టుకోండి..
వైసీపీ హయాంలో రాష్ట్రం ఏవిధంగా ఇబ్బందులు పడిందో అందరూ గుర్తు పెట్టుకోవాలని సీఎం చంద్ర బాబు సూచించారు. 23 నెలల కంటే ముందు రాష్ట్రంలో ఆరాచకం, విధ్వంసం జరిగిందన్నారు. అలాంటి పాలన నా జీవితంలో చూడలేదని తెలిపారు. నాటి పరిస్థితి నుంచి నేడు అభివృద్ది దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తన ఆలోచన అని తెలిపారు. ఇటీవలే గూగుల్ కు ఫౌండేషన్ వేశామన్న చంద్రబాబు.. 2028 ఆగస్టు కంటే ముందే నిర్మాణం పూర్తి చేసి ఆపరేషన్ ప్రారంభించాలని సూచించినట్టు చెప్పారు.