తెలుగు దేశం పార్టీ ఏటా మే నెలలో నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడుకు భారీ ప్రణాళికను ఖరారు చేశారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో మహానాడును నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించి స్థలాలను కూడాఖరారు చేశారు. కానీ, దూరాభారాలను అంచనా వేసిన పార్టీ.. మహానాడు వేదికను నెల్లూరుకు మార్చింది. దీంతో నెల్లూరులోని కొడవలూరు మండలం కిసాన్ సెజ్‌లో మహానాడు నిర్వహణ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
తొలినాళ్లలో 2 లక్షల మంది కార్యకర్తలను మహానాడుకు పిలవాలని.. నాయకులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ఏర్పా ట్లు కూడా ముమ్మరం చేశారు. అయితే.. తాజాగా ఈ విషయంపై దృష్టి పెట్టిన పార్టీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం సభ్యత్వాలు సహా పార్టీ కార్యకర్తలు కూడా పెరిగిన నేపథ్యంలో వారిని మరింత ప్రోత్సహించేందుకు మహానాడు ఒక వేదికగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో 4 లక్షల మంది కార్యకర్తలను మహానాడుకు తీసుకురావాలని.. ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
దీంతో ఇప్పటి వరకు 2 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్న మంత్రులు, మహానాడు నాయకులు.. తాజాగా 4 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. చలువ పందిళ్లు వేసి ఎండవేడిమి తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మజ్జిగ, తాగునీటి కోసం ప్రత్యేకంగా కాంట్రాక్టు సంస్థలకు అవకాశం కల్పించారు. అదేవిధంగా కార్యకర్తలు 4 లక్షల మంది వస్తే.. నాయకులు, విదేశాల్లోని ఎన్నారై నేతలు.. మొత్తంగా మరో 50 వేల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
విందుపై ప్రత్యేక కమిటీ..
మూడు రోజుల పాటు మహానాడులో ఏర్పాటు చేసే టిఫిన్లు, భోజనాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రత్యేకతను కొనసాగిస్తూనే తెలంగాణ, ఏపీల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా వంటవారికి ఆర్డర్లు కాంట్రాక్టులు ఇచ్చినట్టు పార్టీ నాయకులు చెప్పారు. పలు ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న వంటలను కూడా మహానాడులో రుచి చూపించాలని మంత్రులు నిర్ణయించారు. అలాగే.. ఈదఫా తొలిరోజు.. హైదరాబాద్ బిర్యానీని వండి వడ్డించాలని నిర్ణయించినట్టు మంత్రి అనగాని చెప్పారు