బీఆర్ ఎస్ పార్టీని పరుగులు పెట్టించాలని.. క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని.. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నాయకులకు దిశానిర్దేశం చేశారు. సుదీర్ఘంగా ఆరు గంటల పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన నాయకులతో చర్చించారు. ముఖ్యంగా వచ్చే నెల నుంచే పార్టీ కార్యక్ర మాలు పుంజుకోవాలని.. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వంపై పోరాటం చేయాలని.. క్షేత్రస్థాయిలో పార్టీని బలో పేతం చేయాలని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న పరిస్థితులు.. పరిణామాలను కేసీఆర్ పట్టించుకోకపోవడం ఇప్పుడు బీఆర్ ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. నాయకులను ఉద్దేశించి ఆయ న దిశానిర్దేశం చేయడం తప్పుకాదు. పార్టీ పరంగా పుంజుకునేందుకు ఉన్న మార్గాలపై సమాలోచనలు చేయడం కూడా తప్పుకాదు. కానీ, కీలకమైన రెండు విషయాలను కేసీఆర్ విస్మరించారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.
1) జెండో మోసిన వారికి విలువేదీ?: ఆది నుంచి పార్టీలో జెండా మోసిన వారికి విలువ ఏదీ? అనేది ప్రధాన ప్రశ్న. గత 10 సంవత్సరాల పాలనా కాలంలోనూ ఇలాంటి వారికి ప్రాధాన్యం దక్కలేదన్న చర్చ ఉంది. ఆ అసంతృప్తే.. గత ఎన్నికల్లో బీఆర్ ఎస్‌కు శాపమై.. ఓటమిని చవిచూసేలా చేసింది. ఇప్పుడు కూడా జెండా మోసిన వారికి సంబంధించిన నిర్దేశిత ప్రణాళిక కానీ.. పార్టీలో ప్రాధాన్యం కానీ ఇవ్వకపోవడంపై నాయకు లు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై ఆవేదన చెందుతున్నారు.
2) బలమైన ప్రాతిపదిక: పార్టీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సెంటిమెంటును ప్రాతిపదిక గా చేసుకుని ముందుకు సాగింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాతిపదికను పక్కన పెట్టింది. తద్వారా ఉద్యమ సమయంలో పార్టీకి సహకరించిన వారికి అవమానాలే మిగిలాయన్నది ప్రధాన చర్చ. అనేక మంది మంత్రులు అయ్యారు. కానీ, వారిలో సగానికి పైగా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే ఉన్నారన్న లెక్కలు ఉన్నాయి.
కనీసం ఇప్పుడైనా.. ఉద్యమ నాయకులకు ప్రాధాన్యం.. క్షేత్రస్థాయి కార్యకర్తలకు పదవుల భరోసా వంటివాటిని ఇవ్వడంలో కేసీఆర్ ఎక్కడా చొరవ చూపలేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఈ రెండు అంశాలను వదిలేసి.. ఎంత ప్రయత్నం చేసినా.. ఫలితం ఉంటుందా? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.