ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహాలు ఎంత వేగంగా మారుతుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్నటివరకు కేవలం డాటా, సర్వేలు, ఐ-ప్యాక్ (I-PAC) లాంటి పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీల చుట్టూ తిరిగిన వైసీపీ రాజకీయం.. ఇప్పుడు ఊహించని మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది. సెంటిమెంట్లు, నమ్మకాల కంటే సైంటిఫిక్ పొలిటికల్ మేనేజ్‌మెంట్‌కే జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తారనే ముద్ర ఉంది. కానీ, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌లో స్క్రీన్ ప్లే మారుతోందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇందుకు పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరిగిన కొన్ని సంచలన పరిణామాలు, అక్కడ టీవీకే (TVK) అధినేత విజయ్ సాధించిన అనూహ్య విజయమే కారణమని టాక్.
నిన్నమొన్నటి వరకు దళపతి విజయ్(Thalapathy Vijay).. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను, నవరత్నాల వంటి పథకాలను, ఆయన పొలిటికల్ స్టైల్‌ను ఫాలో అవుతున్నారనే చర్చ నడిచింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తమిళనాడులో విజయ్ అనుసరించిన సెంటిమెంట్ ఫార్ములాను ఇప్పుడు జగన్ కూడా పరిశీలిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ కింగ్ మేకర్ అవ్వడం వెనుక ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధాన్ పండిట్ సలహాలు, గ్రహగతుల లెక్కలు ఉన్నాయనే వార్తలు దేశవ్యాప్తంగా హల్‌చల్ చేశాయి. ఈ సక్సెస్ ఫార్ములాను గమనించిన వైసీపీ అధినేత, ఇకపై కేవలం గ్రౌండ్ రిపోర్టులనే కాకుండా గ్రహాల అనుకూలతను కూడా నమ్ముకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తాడేపల్లి ప్యాలెస్‌లోకి చండీగఢ్‌కు చెందిన ప్రముఖ ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ ప్రతాప్ ఎంట్రీ ఇచ్చారనే లీకులు ఏపీ(AP) పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నాయి. 2019లో అధికారంలోకి రావడానికి వైసీపీకి ఐ-ప్యాక్ వ్యూహాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు ఎంతగానో ప్లస్ అయ్యాయి. అప్పట్లో కోడికత్తి సెంటిమెంట్ కూడా ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కానీ, 2024 నాటికి సీన్ మారింది. గులకరాయి ఘటనలు, ఐ-ప్యాక్ చేసిన ప్రచారాలు జనం పసిగట్టేయడంతో.. ఆ పాత ఫార్ములాలు వికటించి ఘోర పరాజయం ఎదురైంది. 2029లో మళ్ళీ పీఠం దక్కించుకోవాలంటే కేవలం ఐ-ప్యాక్ హంగామా సరిపోదని జగన్ ఒక అంచనాకు వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి.
కార్పొరేట్ తరహా రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. వైసీపీ(YCP) 2.0 కోసం జాతక చక్రాలు, యజ్ఞ యాగాలు, జ్యోతిష్యుల సలహాల మేరకే అడుగులు వేయాలని తాడేపల్లి పెద్దలు భావిస్తున్నారట. ఇప్పటివరకు సర్వే రిపోర్టులతో ఎమ్మెల్యేల టిక్కెట్లు కేటాయించిన జగన్, రాబోయే రోజుల్లో జాతకాల బలాన్ని బట్టి అభ్యర్థులను ఖరారు చేస్తారా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఐ-ప్యాక్ స్థానంలోకి ఇప్పుడు జ్యోతిష్యులు రావడం, విజయ్ రూట్‌ను జగన్ ఫాలో అవుతుండటం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. మరి ఈ నయా ట్రెండ్ జగన్(Jagan)ను 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతుందో లేదో చూడాలి.