తమిళనాడు రాజకీయాల్లో సింగంగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ మాజీ అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై(K.Annamalai) ప్రస్థానంలో సరికొత్త మలుపు రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. తమిళ గడ్డపై డీఎంకే సర్కార్‌ను, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను గట్టిగా ఢీకొంటున్న అన్నామలైని.. ఇప్పుడు పార్లమెంట్‌లో కూర్చోబెట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. తమిళనాడులో అన్నామలైని రాజ్యసభకు పంపేంత బలం బీజేపీకి లేకపోవడంతో, అధిష్టానం చూపు ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం అన్నామలైకి కలిసొచ్చే అంశం. త్వరలోనే ఏపీ నుంచి ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును మిత్రధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే, ఏపీ నుంచి అన్నామలై పెద్దల సభకు వెళ్లడం ఖాయం. దక్షిణాదిలో బీజేపీకి ఒక పవర్‌ఫుల్ వాయిస్ కావాలని కోరుకుంటున్న మోదీ-షా ద్వయం, అన్నామలైని రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రివర్గంలోకి కూడా తీసుకునే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జాతీయ స్థాయిలో ఎండగట్టడంలో అన్నామలై కీలకంగా వ్యవహరించారు. ఆయనకున్న దూకుడు, సబ్జెక్టుపై పట్టు చూసి అధిష్టానం ఫిదా అయ్యింది. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది వ్యవహారాలను ఢిల్లీ(Delhi) నుంచి శాసించే స్థాయికి అన్నామలైని ఎదగనివ్వాలన్నది హైకమాండ్ మాస్టర్ ప్లాన్. ఇందుకోసం ఆయనకు పార్లమెంటరీ పవర్ ఇవ్వడం ద్వారా అటు తమిళనాడులో పార్టీ క్యాడర్‌కు కూడా కొండంత అండ లభిస్తుందని బీజేపీ భావిస్తోంది.
అన్నామలైని ఏపీ నుంచి పంపాలనే ప్రతిపాదన అమరావతి(Amaravati) రాజకీయాల్లోనూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో మూడింటిని తన వద్దే ఉంచుకుని, మిగిలిన ఒకటి మిత్రపక్షాలకు ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తోంది. చంద్రబాబుతో అన్నామలైకి ఉన్న పాత పరిచయాలు, సత్సంబంధాల దృష్ట్యా ఈ ప్రతిపాదనకు ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అన్నామలై ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్తే, అది దక్షిణాది రాజకీయాల్లోనే ఒక సంచలన పరిణామం కానుంది.