భారత సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఒక ఊపు ఊపేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party) సరిహద్దులు దాటింది. మన దగ్గర మీమ్స్‌తో మొదలైన ఈ వినూత్న ట్రెండ్.. ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్‌కు సైతం పాకేసింది. అక్కడ కూడా ‘కాక్రోచ్ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్ అవామీ లీగ్’ అంటూ సరికొత్త డిజిటల్ విప్లవాలు పుట్టుకొస్తున్నాయి. నయా ట్రెండ్‌తో పాక్ యువత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
భారతదేశంలో పుట్టిన ఈ ఐడియాను తాము కాపీ కొట్టినట్లు పాకిస్థానీ జెన్-జెడ్ (Gen-Z) యువత ఏమాత్రం దాచడం లేదు. అక్కడి కాక్రోచ్ అవామీ పార్టీ తమ ఇన్‌స్టాగ్రామ్ బయోలోనే.. ‘‘అవును కాపీ కొట్టాం, కానీ ఎవరికి నష్టం? మా మోటో ఒక్కటే’’ అంటూ ఓపెన్‌గా డిక్లేర్ చేసింది. ఇరు దేశాల్లోని నిరుద్యోగ యువత సమస్యలు ఒకటే కావడంతో, ఈ సరికొత్త ట్రెండ్‌ను వారు ఓ రేంజ్‌లో ఓన్ చేసుకుంటున్నారు.
ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా, ఎలాంటి విపత్తునైనా తట్టుకుని బతికే మొండి జీవి బొద్దింక(Cockroach). సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌ను పాక్ యువత తమ ఆయుధంగా మార్చుకుంది. ` ఈ వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించి నిర్లక్ష్యం చేసిందో.. మేం ఆ ప్రజల గొంతుకలం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడతాం` అంటూ ఉర్దూ నినాదాలతో నెట్టింట హోరెత్తిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, పాలనా విఫలతలపై తమకున్న తీవ్ర అసంతృప్తిని ఈ బొద్దింక గుర్తుతో, మీమ్స్ రూపంలో ఎండగడుతున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ, నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్, అలాగే పీపీపీ వంటి సాంప్రదాయ రాజకీయ పార్టీల హవా నడుస్తోంది. అయితే, ఈ పాత తరం రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, డిజిటల్ వేదికగా దూసుకొస్తున్న ఈ కాక్రోచ్ పార్టీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిజిటల్ ఓటర్లుగా మారబోతున్న యువత అంతా ఈ సరికొత్త ట్రెండ్ వైపు మొగ్గు చూపుతుండటంతో.. అక్కడి ప్రధాన పార్టీలకు సైతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. మొత్తానికి, ఇండియా(India)లో పుట్టిన ఒక ఫన్నీ మీమ్ ట్రెండ్.. పాక్‌లో ఒక పొలిటికల్ మూవ్‌మెంట్‌లా మారడం ఇప్పుడు ఇరు దేశాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.