తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు(Mahanadu 2026)' పండుగ మంగళగిరి వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జెండాను ఆవిష్కరించి, యుగపురుషుడు నందమూరి తారకరామారావుకు ఘన నివాళులర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో ఈ రెండ్రోజుల పండుగ అధికారికంగా మొదలైంది. అయితే, ఎప్పటికప్పుడు కాలంతో పాటు మారే చంద్రబాబు.. ఈసారి మహానాడును సరికొత్త హంగులతో, సరికొత్త లక్ష్యంతో డిజైన్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అధికారంలో ఉన్నాం కదా అని విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు(Chandhrababu) తన యాక్షన్ ప్లాన్ ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఈ మహానాడు వేదికగా ఆయన కన్ను పూర్తిగా 2029 అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జెండా పాతడమే లక్ష్యంగా పార్టీ నేతలకు, శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం భవిష్యత్తు కార్యాచరణను వివరించేలా మొత్తం 20 కీలక తీర్మానాలను ఈ మహాసభల్లో ప్రవేశపెట్టబోతున్నారు. పాలనతో పాటు పార్టీని కూడా సమాంతరంగా బలోపేతం చేయడమే ఈసారి బాబు ప్రధాన టార్గెట్.
అలాగే ఈ ఏడాది మహానాడులో మరో విశేషం ఏమిటంటే.. ఖర్చును, ఇంధనాన్ని పొదుపు చేస్తూనే ప్రతి కార్యకర్తనూ భాగస్వామ్యం చేయడం. అందుకోసం టెక్నాలజీని వాడుకుంటూ పూర్తి హైబ్రిడ్ విధానంలో దీనిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అమరావతి వేదికగా జరుగుతున్న ఈ సభలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్(Nara Lokesh), హోంమంత్రి అనిత వంటి ముఖ్యనేతలు పాల్గొనగా.. అటు క్లస్టర్ల వారీగా వర్చువల్ విధానంలో వేలాది మంది టీడీపీ శ్రేణులు కనెక్ట్ అయ్యారు. కేవలం చూడటమే కాదు.. నేరుగా కేంద్ర నాయకత్వంతో కార్యకర్తలు మాట్లాడేలా ఈ అధునాతన స్క్రీన్ల ద్వారా చాన్స్ కల్పించడం విశేషం. వినూత్న సాంకేతికత, ముందస్తు వ్యూహాలతో సాగుతున్న ఈ రెండ్రోజుల మహానాడు.. టీడీపీ భవిష్యత్తు రాజకీయాలకు ఎలా దిక్సూచిగా మారబోతోందో చూడాలి.