టీడీపీలో కోటంరెడ్డి కొత్త డిమాండ్.. బాబు ఒప్పుకుంటారా?

admin
Published by Admin — May 27, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడి నేతల వ్యూహాలు, మాటల యుద్ధాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. తాజాగా, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చకు దారితీస్తున్నాయి. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆయన ఇప్పటి నుంచే తన భవిష్యత్తు రాజకీయ ముసాయిదాను సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈసారి ఆయన పెట్టిన డిమాండ్ సొంత పార్టీలోనే కాక, ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

సాధారణంగా సీనియర్ నాయకులు తమ రాజకీయ వారసులుగా కొడుకులను లేదా కూతుర్లను రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం రూట్ మార్చారు. తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి(Kotamreddy Giridhar Reddy)ని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చూడాలన్నది తన కుటుంబ సభ్యుల బలమైన కోరిక అని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అది కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ స్థానం నుంచే గిరిధర్ రెడ్డి బరిలోకి దిగుతారని క్లారిటీ ఇచ్చారు. అయితే, తమ్ముడి కోసం తాను త్యాగం చేయడం లేదని, రాబోయే ఎన్నికల్లో తాను కూడా ఖచ్చితంగా పోటీలోనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేయడం ఇక్కడ విశేషం.

ఈ వ్యూహం వెనుక ఒక బలమైన రాజకీయ సమీకరణం ఉందనే చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియను కోటంరెడ్డి ముందే ఊహించినట్లు తెలుస్తోంది. ఈ విభజనలో భాగంగా నెల్లూరు రూరల్, సిటీ పరిధులను మార్చి కొత్తగా నెల్లూరు నియోజకవర్గం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ కొత్త నియోజకవర్గం వస్తే.. ఒక స్థానంలో తాను, మరో స్థానంలో తన తమ్ముడు పోటీ చేయాలనే ముందస్తు ప్లాన్‌తోనే కోటంరెడ్డి మీడియా ముఖంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని స్థానిక నేతలు భావిస్తున్నారు. భవిష్యత్తులో సీట్ల సర్దుబాటు సమయంలో ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసి పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు అందరి కళ్లూ టీడీపీ అధిష్టానంపైనే ఉన్నాయి. నెల్లూరులో కోటంరెడ్డి బ్రదర్స్‌కు మంచి పట్టు ఉన్న మాట వాస్తవమే అయినా.. ఒకే కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించడంపై చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఎంతోమంది సీనియర్లు, ఆశావాహులు టికెట్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, కోటంరెడ్డి ఓపెన్ డిమాండ్‌కు బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక సర్దుబాటు మంత్రం వేస్తారా? అనేది చూడాలి. ఏది ఏమైనా, ఎన్నికలకు ముందే కోటంరెడ్డి విసిరిన ఈ పొలిటికల్ గూగ్లీ ఇప్పుడు టీడీపీ హైకమాండ్‌కు ఒక పెద్ద టాస్క్‌గా మారిందనే చెప్పాలి.

Tags
TDP Nellore Politics Kotamreddy Sridhar Reddy Chandrababu Naidu AP Politics Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News