బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైత్రీవనంలో మహానాయకుడు, తెలుగు వారి అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి న అనంతరం.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక సందర్భాల్లో(ఇప్పుడు కాదు) కేసీఆర్.. ఎన్టీఆర్‌ను విమర్శించారని గుర్తు చేశారు. కానీ, వాస్తవానికి కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది.. ఎవరని ప్రశ్నించారు. ఆయన నీడలో బతికిన మీరా.. అన్నగారిని అవమానించేవారని నిలదీశారు.
ఎన్టీఆర్ పిలుపుతోనే కదా.. రాజకీయాల్లోకి వచ్చారని కేసీఆర్(KCR)ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయనను అనేంత పెద్దలు అయ్యారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్.. ఏపీ వాసి కాదని.. ఆయ న జాతి రత్నమని వ్యాఖ్యానించారు. కొంతమంది నాయకులకు సరిహద్దులు ఎవరూ గీయలేరని చెప్పారు. అలాంటి వారిలో అన్నగారు ముందుంటారని చెప్పారు. ఇందిరాగాంధీ, అంబేడ్కర్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురు నాయకులకు సరిహద్దులు గీసి.. ప్రాంతీయతత్వాన్ని అంటకట్టడాన్ని మించిన మహా నేరం.. పాపం కూడా ఉండదన్నారు.
తమకు ఇందిరమ్మ ఎంత ముఖ్యమో.. ఎన్టీఆర్(NTR) కూడా అంతే ముఖ్యమని సీఎం చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకునే అవకాశం రావడం.. తనకు జీవితాంతం గుర్తుండి పోతుందని చెప్పారు. దేశంలో స్ఫూర్తిమంతమైన నాయకులు ఇందిర, అంబేడ్కర్, ఎన్టీఆర్ లేనని చెప్పారు. వీరు జాతిరత్నాలని వ్యాక్యానించారు. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన అంబేడ్కర్, మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఎన్టీఆర్.. రాజభరణాల రద్దుతో పేదలకు పెద్దపీట వేసిన ఇందిరమ్మలకు హద్దులు నిర్ణయించగలరా? అని ప్రశ్నించారు.
`ఔను.. నేను కాంగ్రెస్(Congress) పార్టీముఖ్యమంత్రినే. అయినా.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా. ఎవరు ఎన్ని విమర్శలు చేసుకుంటారో చేసుకోండి. నేను లెక్క చేయను.` అని రేవంత్ తెగేసి చెప్పారు. తెలంగాణ సమస్యలపై కూడా ఎన్టీఆర్ పోరాటం చేశారని.. విమర్శలు చేసేవారు గుర్తు పెట్టుకోవాలన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను నిలిపివేసి.. తెలంగాణకు జీవం పోశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సహా అనేక మంది తెలంగాణ నాయకులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు ఆయనను విమర్శించేంత పెద్దోళ్లు అయిపోయారని విమర్శలు గుప్పించారు.