వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 9 ఎకరాలకు పైబడిన భూమిని చీప్‌గా కొట్టేసేందుకు ప్రయత్నించి.. ఆయన పోలీసుల చేతికి చిక్కారు. హైదరాబాద్‌లోని శేరిలింగం పల్లెలో ఉన్న ప్రభుత్వ భూమినే.. నకిలీ పత్రాలతో బొల్లా కొల్లగొట్టేందుకు కుట్ర చేశారని.. సాక్షాత్తూ.. పోలీసు ఉన్నతాధికారే వెల్లడించారు. దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన భూములను దక్కించుకునే ప్రయత్నం చేశారని అన్నారు.
కట్ చేస్తే.. ఆ కేసు సంగతి ఎలా ఉన్నా.. అసలు.. గుంటూరులో వైసీపీ హయాంలో బొల్లాపై తీవ్ర విమర్శ లు వచ్చాయి. వినుకొండ ఎమ్మెల్యేగా వ్యవహరించిన సమయంలో ఆయన అనేక భూములను నామ మాత్రపు ధరలకు కొనేశారని.. మరికొందరిని బెదిరించి తనకు తోచినంత చేతిలో పెట్టి.. భూములు సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసింది.. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కీలక నాయకులే. అంతేకాదు.. అలా చీపుగా కొట్టేసిన భూములను జగనన్న ఇళ్ల కాలనీల కోసం.. వందల కోట్లకు తిరిగి ప్రభుత్వానికే అప్పగించారని కూడా చెప్పుకొచ్చారు.
వినుకొండ సహా.. గుంటూరు శివారులోని పలు ప్రాంతాల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీ లకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భూములు సేకరించింది. ఇలా.. కొందరు వైసీపీ నాయ కులు.. ప్రభుత్వానికి తమ భూములు విక్రయించారు. బొల్లా వంటి మేధావులు.. దొడ్డిదారిలో అప్పటికప్పు డు.. కొనుగోలు చేసి.. ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారన్న వాదన అప్పట్లో తెరమీదికి వచ్చింది. దీనిపై టీడీపీ నాయకులు ముఖ్యంగా గుంటూరు నేతలు పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు.
కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మరిచిపోయారు. నిజానికి బొల్లా భూబాగోతంపై పెద్దగా తవ్వి తీయాల్సిన అవసరం ఏమీ లేదు. జగనన్న ఇళ్ల కాలనీలకు.. కొనుగోలు చేసిన భూముల వివరాలు పరిశీలిస్తే చాలు. అన్ని అక్రమాలు వెలుగు చూస్తాయి. కానీ, ఈ పనిని చేయడంలో సర్కారు ఎందుకో వెనుకాడుతోంది. ఏపీలో నాయకుడు, పైగా టీడీపీ నేతలపై వరుస కేసులు పెట్టించిన బొల్లా విషయంలో పొరుగు రాష్ట్రంలో కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు వినుకొండ భూముల సంగతేంటన్న చర్చ తెరమీదికి వచ్చింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కదులుతుందా? లేదా? అనేది చూడాలి.